కాజీపేట, నవంబర్ 10 : విజయవాడకు కాజీపేట రైల్వేడ్రైవర్ల క్రూ లింకుల తరలింపుపై రైల్వే ఉన్నతాధికారులతో చర్చించి, సరైన నిర్ణయం తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా హామీ ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ తెలిపారు. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో బుధవారం సాయంత్రం ఎంపీలు, ప్రభుత్వ చీఫ్ విప్, తెలంగాణ రైల్వే జేఏసీ నాయకులు రైల్వే జీఎంను కలిసి క్రూ లింకులు, తదితర సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీలు, చీఫ్ విప్ మాట్లాడుతూ కాజీపేట క్రూ లింకులను విజయవాడకు ఎందుకు తరలిస్తున్నారని, విజయవాడలో అనధికారంగా నడుపుతున్న క్రూ డిపోను తిరిగి వరంగల్ రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేయించాలని కోరారు. కాజీపేట జంక్షన్‌కు రైల్వే డివిజన్‌స్థాయి గుర్తింపు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే అధికారులు నిర్వీర్యం చేస్తున్నారని పేర్కొన్నారు. రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్ నిర్మాణ పనులు, రైల్వే జంక్షన్ అభివృద్ధి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. దీనిపై రైల్వే జీఎం స్పందిస్తూ క్రూ లింకుల తరలింపు విషయం క్షుణ్ణంగా తెలియదని, సంబంధిత అధికారులతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్ నిర్మాణ స్థలం కేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, తెలంగాణ రైల్వే జేఏసీ నాయకులను అభినందించారు. కాజీపేటలో త్వరలోనే రైల్వే వ్యాగన్ పీవోహెచ్ నిర్మాణ పనులకు టెండర్లు పిలుస్తామని జీఎం వెల్లడించారు. రైల్వే జీఎంను కలిసిన వారిలో తెలంగాణ రైల్వే ఎంప్లాయీస్ జేఏసీ కన్వీనర్, చైర్మన్ దేవులపల్లి రాఘవేందర్, కొండ్ర నర్సింగరావు, సోమేశ్వర్రావు ఉన్నారు.