పీఎంఈజీపీ రాష్ట్ర నోడల్ అధికారి నారాయణరావు
ఉపాధి కల్పన పథకంపై అవగాహన సదస్సు
కృష్ణకాలనీ నవంబర్ 10 : పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పీఎంఈజీపీరాష్ట్ర నోడల్ అధికారి నారాయణరావు అన్నారు. బుధవారం ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఆధ్వర్యంలో జయశంకర్ జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్లో నిరుద్యోగులు, మహిళా పొదుపు సంఘాల సభ్యులకు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు 25 నుంచి 35 శాతం వరకు సబ్సిడీ రుణాలు అందజేయనున్నట్లు చెప్పారు. ఈ పథకం కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తిస్తుందన్నారు. తయారీ రంగానికి గరిష్టంగా రూ.25 లక్షలు, సేవా రంగానికి గరిష్టంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ఈ పథకంలో రుణాలు పొందేవారు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, దళారులను నమ్మవద్దన్నారు. అనంతరం పథకం ద్వారా ఎలా లబ్ధిపొందాలనే విషయమై వివరించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు, పీఎంఈజీపీ మార్కెటింగ్ నిపుణులు రీజినల్ అధికారి అశోక్‌కుమార్, టెక్నికల్ నిపుణుడు భూమయ్య, బ్యాంక్ అధికారులు, జిల్లా పరిశ్రమల మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.