జయశంకర్ భూపాలపల్లి జిల్లా దవాఖానకు 10 వెంటిలేటర్ బెడ్స్ అందజేత
కాటారం మండలం బొప్పారం గ్రామస్తుల ఔదార్యం
అంబులెన్స్ అందించిన ఈసీఐఎల్ సంస్థ
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మోటర్‌బైక్ అంబులెన్స్
జిల్లావాసులకు అందుబాటులో కార్పొరేట్ స్థాయి వైద్యం
జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 9 (నమస్తేతెలంగాణ) : పేదల వైద్యానికి పలువురు దాతలు భరోసా ఇస్తున్నారు. మారుమూల గ్రామాలవారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు తోడ్పాటునిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాధాన్యం ఇస్తుండగా, పలు స్వచ్ఛంద, కార్పొరేట్ సంస్థలు సైతం తోడవుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్యశాలకు కాటారం మండలం బొప్పారం గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు పది వెంటిలేటర్ బెడ్లు అందించగా, ఈసీఐఎల్ సంస్థ అత్యాధునిక వసతులు కలిగిన అంబులెన్స్, రోటరీ క్లబ్ మోటర్ బైక్ అంబులెన్స్ ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నాయి. దాతల చేయూతతో ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుండడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు చెప్పిన నానుడి నేడు నిజమని స్పష్టమవుతున్నది. కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం సంభవిస్తే ఆ కుటుంబం మొత్తం బజారున పడే పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, కేసీఆర్ కిట్లతో పాటు అత్యాధుని వైద్య సేవలు అందిస్తూ వైద్య రంగానికి పెద్దపీట వేసింది. అంతేకాకుండా ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందని పలు వ్యాధులకు ప్రైవేట్ దవాఖనల్లో సొంత ఖర్చులతో వైద్య సేవలు పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందించి బాధితులకు ఆదుకుంటున్నది. ప్రస్తుత రోజుల్లో సామాజిక స్పృహ కలిగిన కొంత మంది సామాజిక కార్యక్రమాలకు తమవంతు సహకారం అందిస్తున్నారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేందుకు అధునాతన వైద్య పరికరాలు అందిస్తూ దాతృత్వం చాటుకుంటున్నారు. ఇందులో భాగంగానే జయశంకర్ భూపాలపల్లికి చెందిన పలువురు అత్యంత విలువైన వైద్య పరికరాలను జిల్లా దవాఖానకు అందజేశారు. అంతేకాకుండా రోటరీక్లబ్, ఈసీఐఎల్ సంస్థలు ముందుకు వచ్చాయి. ప్రజలు కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు తమవంతు సహకారం అందిస్తున్నారు.
అంబులెన్స్ అందించిన ఈసీఐఎల్
కార్పొరేటర్ దిగ్గజంగా ఉన్న ఈసీఐఎల్ తమ సంస్థ అందిస్తున్న ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కార్యక్రమం ద్వారా జిల్లా ప్రధాన వైద్యశాలకు అత్యాధునిక వసతులు కలిగిన అంబులెన్స్‌ను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు ఆ సంస్థ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) మాల్వియ అందజేశారు. కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గండ్ర అందించిన అంబులెన్స్ మాత్రమే ఉంది. దానికి తోడు ఈ అంబులెన్స్ రావడం వల్ల జిల్లాలోని ప్రజలకు అపత్కాలంలో మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి.
మోటర్ బైక్ అంబులెన్స్
108, 102 వాహనాలు వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు సులువుగా వెళ్లి ఆపదలో ఉన్న వారిని రక్షించేందుకు వరంగల్ రోటరీ క్లబ్ వారు రూ. 1.80 లక్షల విలువ చేసే మోటర్ బైక్ అంబులెన్స్‌ను అందించారు. ఇందులో 31 రకాల వైద్య పరికరాలతో కూడిన కిట్ ఉంటుంది. దీనిని కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు అందజేశారు. అటవీ, మారుమూల ప్రాంతాలకు సైతం వైద్య సిబ్బంది సులువుగా వెళ్లి ప్రమాదంలో ఉన్న వారికి మెరుగైన వైద్య సేవలను అందించే అవకాశం ఉంటుంది.
ఐసీఐ బ్లాక్ ఏర్పాటు చేసిన జిల్లా వాసులు
జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రధాన వైద్యశాలలో అత్యాధునిక వసతులు అందాలనే లక్ష్యంతో కాటారం మండలం బొప్పారం గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు ఊరుసందు కిశోర్‌రావు, సుశాన్రావు తోడ్పాటునందించారు. హైదరాబాద్‌కు చెందిన నిర్మాణ్ ఆర్గనైజేషన్, ఇండో అమెరికన్చారిటీ యూఎస్ఏ సతీశ్ ఎల్లంకిసహకారంతో 10 పడకల ఐసీయూ బ్లాక్‌ను దవాఖానలో ఏర్పాటు చేశారు.