పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం వద్దు
బృహత్ ప్రకృతి వనం పనుల్లో వేగం పెంచాలి
అడిషనల్ కలెక్టర్ టీఎస్ దివాకర
పల్లెప్రగతిపై అధికారులతో సమీక్ష
భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 9 : పల్లెప్రగతి పనులు జిల్లాలో అక్టోబర్ 10 లోగా పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ టీఎస్ దివాకర అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్లో పల్లెప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, అన్ని మండలాల స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మండలాల వారీగా పల్లె ప్రగతి పనులపై సుధీర్ఘంగా చర్చించారు. క్రెమటోరియా పనులు, నర్సరీలు, ప్లాంటేషన్, హోంస్టెడ్ ప్లాంటేషన్, ఈజీఎస్ రిజిష్టర్స్ మెయిన్టెనెన్స్, ట్రాక్టర్ లోన్ రీ పేమెంట్ , సెగ్రిగేషన్ షెడ్ పనులు, లేబర్ రిపోర్టు, బృహత్ పల్లె ప్రకృతి వనాల పరిస్థితి, శానిటేషన్ తదితర అంశాలపై చర్చించారు. పనుల్లో పురోగతి లేని మండలాల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్టోబర్ 10 లోగా పూర్తి చేయాలన్నారు. గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య పనులపై నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రస్తుతం వర్షాల దృష్ట్యా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే గ్రామాల్లో ఇంటి పన్ను వసూళ్లు 100 శాతం పూర్తి చేయాలన్నారు.మొదటి విడుతగా ప్రతి మండలంలో రెండు లేదా మూడు గ్రామాల్లో ఇంకుడు గుంతలు నిర్మించాలన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనాల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఆదేశించారు. పల్లెప్రగతి పనుల్లో జిల్లాను టాప్ 10గా నిలిపేందుకు అధికారులు అంకితభావంతో పనిచేయాలని కోరారు. సమావేశంలో డీఆర్డీవో పురుషోత్తం, జడ్పీ సీఈవో శోభారాణి, డీపీవో ఆశాలత పాల్గొన్నారు.