రెండో రోజూ ఉత్సాహంగా రాష్ట్రస్థాయి కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలు
నువ్వా, నేనా అన్నట్లు తలపడుతున్న క్రీడాకారులు.. నేడు ఫైనల్స్
జనగామ చౌరస్తా, డిసెంబర్ 8 ;కబడ్డీ పోటీలు రెండో రోజూ హోరాహోరీగా సాగాయి. కోర్టులోకి దిగి కూత పెడుతూ నువ్వా, నేనా అన్నట్లు తలపడడం ఆద్యంతం ఉత్కంఠ రేపాయి. నేడు సెమీ ఫైనల్స్, ఫైనల్స్ జరుగనుండగా గెలుపు కోసం ఆయా జట్లు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. చాంపియన్‌షిప్ కైవసం చేసుకునేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నాయి.
వరంగల్ పోలీస్ కమిషనరేట్(వెస్ట్‌జోన్) సారథ్యంలో జనగామ జిల్లాకేంద్రంలోని బతుకమ్మకుంట వద్ద ‘కాకతీయ స్టేట్ లెవెల్ కబడ్డీ చాంపియన్‌షిప్ 2021’ పోటీలు బుధవారం హోరాహోరీగా జరిగాయి. రెండో రోజు పురుషుల విభాగంలో వరంగల్, ఆదిలాబాద్ జట్ల మధ్య పోటీ జరుగగా వరంగల్ 43/19 స్కోర్‌తో ఆదిలాబాద్‌పై విజయం సాధించింది. అలాగే నిజామాబాద్-కరీంనగర్ జట్ల మధ్య పోటీలో నిజామాబాద్ 26/25 స్కోర్‌తో కరీంనగర్‌పై సత్తా చాటింది. అలాగే రంగారెడ్డి జట్టు 34/15 స్కోర్‌తో ఆదిలాబాద్ జట్టుపై, మహబూబ్‌నగర్ 32/15 స్కోర్‌తో మెదక్ జట్టుపై విజయం సాధించింది. హైదరాబాద్ జట్టు 36/29 స్కోర్‌తో ఖమ్మం జట్టుపై విజయం సాధించింది. నిజామాబాద్, నల్లగొండ జట్ల మధ్య జరిగిన పోటీలో, నల్గొండ జట్టు 55/21 స్కోర్‌తో నిజామాబాద్ జట్టుపై విజయం సాధించింది. అదేవిధంగా మహిళల విభాగంలో డీసీపీ వెస్ట్‌జోన్-11 జట్టు, ఏసీపీ వర్ధన్నపేట-11 జట్ల మధ్య జరిగిన కబడ్డీ పోటీలో, డీసీపీ వెస్ట్‌జోన్-11 జట్టు 40/6 స్కోర్‌తో ఏసీపీ-11 వర్ధన్నపేట జట్టుపై విజయం సాధించింది. సీపీ వరంగల్-11 జట్టు, ఏసీపీ జనగామ-11 జట్ల మధ్య జరిగిన పోటీలో, సీపీ వరంగల్-11 జట్టు 40/29 స్కోర్‌తో ఏసీపీ జనగామ-11 జట్టుపై విజయం సాధించింది. ఏసీపీ ఘన్పూర్-11 జట్టు, ఏసీపీ వర్ధన్నపేట-11 జట్ల మధ్య జరిగిన పోటీలో, ఏసీపీ ఘన్పూర్-11 జట్టు 39/13 స్కోర్‌తో ఏసీపీ వర్ధన్నపేట-11 జట్టుపై విజయం సాధించింది. ఏసీపీ జనగామ-11 జట్టు, డీసీపీ వెస్ట్‌జోన్-11 జట్ల మధ్య జరిగిన పోటీలో, డీసీపీ వెస్ట్‌జోన్-11 జట్టు 38/30 స్కోర్‌తో ఏసీపీ జనగామ-11 జట్టుపై విజయం సాధించింది. పురుషుల విభాగం కబడ్డీ, మహిళల విభాగం కబడ్డీ ఫుల్ మ్యాచ్‌లు బుధవారం రాత్రి వరకు కొనసాగాయి. బుధవారం ఉదయం నుంచి జరుగుతున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల వద్దకు వెస్ట్‌జోన్ (జనగామ) డీసీపీ బీ శ్రీనివాస్‌రెడ్డి హాజరై, మ్యాచ్‌లను ఆసక్తిగా తిలకించారు.