వ్యవసాయ శాఖ సలహాలు తీసుకోవాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాలు వినియోగించుకోవాలి
ఐకేపీ కేంద్రాల పరిశీలనలో జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య
నర్మెట, డిసెంబర్ 8: వాణిజ్య పంటలపై రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య సూచించారు. మండలంలోని వెల్దండ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ గంగా భవానీని ఆదేశించారు. సరిగా లారీలు రాకపోవడంతో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని పలువరు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఆయన సంబంధిత లారీ ట్రాన్స్‌పోర్టు యజమానులతో మాట్లాడి అదనంగా లారీలను పంపించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుకు సూచించారు. కొనుగోలు కేంద్రంలో కాంటాలను అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. రైతులు, హమాలీలు సహకరించాలని కోరారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ప్రతి ఒక్కరికీ రెండు డోసుల టీకాలు వందశాతం పూర్తి చేయాలన్నారు. అనంతరం నర్మెట తహసీల్దార్ కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. రైతులు వరికి బదులు ఆరుతడి పంటలను సాగు చేయాలని శివలింగయ్య కోరారు. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఇతర పంటలపై అవగాహన కల్పిస్తారన్నారు. దీనిపై సలహాలు, సూచనల కోసం 7288894712 హెల్ఫ్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. అధిక దిగుబడులు వచ్చే వాణిజ్య పంటలు, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వేయాలని సూచించారు. ఆయన వెంట డీఆర్డీవో రాంరెడ్డి, వ్యవసాయశాఖ జిల్లా అధికారి రాధిక, డీఎంహెచ్‌వో మహేందర్, మండల వ్యాక్సినేషన్ ప్రత్యేకాధికారి రమేశ్, ఎంపీడీవో ఖాజానయీమొద్దీన్, ఎంపీపీ తేజావత్ గోవర్ధన్, ఆర్ఐ వంశీకృష్ణ, ఏపీఎం నాగేశ్వర్రావు ఉన్నారు.
రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలి : కలెక్టర్
బచ్చన్నపేట : రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, వరికి బదులు రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ఆదేశించారు. బుధవారం మండలంలోని కొడవటూరులో ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని సందర్శించారు. అనంతరం రైతులతో కలెక్టర్ మాట్లాడారు. గ్రామాల్లో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలన్నారు. కాంటాలయిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలన్నారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని, రైతులు ఇంటి అవసరాల నిమిత్తం లేదా, సీడ్ కంపెనీలకు, రైస్ మిల్లులకు అమ్ముకోవాలనుకుంటే వరి సాగు చేయాలన్నారు. వాణిజ్య పంటల లాభసాటిగా ఉంటాయని సూచించారు. రైతువేదికలో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని ఆయన అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి, తహసీల్దార్ శైలజ, ఏపీఎం జ్యోతి పాల్గొన్నారు.