భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా
కలెక్టర్‌ను కలిసిన సింగరేణి డైరెక్టర్ బలరాం నాయక్
భూపాలపల్లి రూరల్, నవంబర్ 8 : సింగరేణి భూ సేకరణ పనులను వేగవంతం చేసి, త్వరగా పూర్తిచేయనున్నట్లు భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. సింగరేణి డైరెక్టర్ బలరాం నాయక్ సోమవారం అధికారులతో కలిసి కలెక్టరేట్లో భవేశ్ మిశ్రాను కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని సింగరేణి సంస్థ కార్యకలాపాలపై చర్చించారు. రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి.. బొగ్గు ఉత్పత్తితో పాటు కార్మిక సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో అవసరమైన భూ సేకరణకు ప్రభుత్వ యంత్రాంగం సహకారం అందిస్తున్నదని, పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశానికి విద్యుత్‌ను అందించేందుకు, పరిశ్రమలు నడిచేందుకు బొగ్గు ను సరఫరా చేయడంలో సింగరేణి సంస్థ ప్రముఖ పాత్ర పోషిస్తున్నదన్నారు. జిల్లాలో కేటీకేఓసీ-2, కేటీకేఓసీ-3 విస్తరణ కోసం అవసరమైన పెండింగ్‌లో ఉన్న భూ సేకరణపై ప్రధానంగా దృష్టి పెట్టామని తెలిపారు. త్వరలో భూ సేకరణ పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే సింగరేణి భూముల సంరక్షణకు సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఏరియా జీఎం శ్రీనివాసరావు, ఎస్వోటూ డైరెక్టర్ రవిప్రసాద్, సీనియర్ ఎస్టేట్ అధికారి బాబుల్ రాజ్, కేటీకేఓసీ-3 ప్రాజెక్ట్ మేనేజర్ రాజగోపాల్, ఎస్టేట్ మేనేజర్ కుమారస్వామి పాల్గొన్నారు.