తహసీల్దార్ మహ్మద్ ఇర్బాల్
కృష్ణకాలనీ, నవంబర్ 7: భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన స్పెషల్ సమ్మరి రివిజన్-2022లో భాగంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని భూపాలపల్లి తహసీల్దార్ మహ్మద్ ఇర్బాల్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలనీ, జవహర్ నగర్ కాలనీ, ఫైలెట్ కాలనీ, రెడ్డికాలనీ, కృష్ణకాలనీ, హనుమాన్ నగర్, శాంతినగర్, ఎల్బీ నగర్, లక్ష్మీనగర్, రాజీవ్ నగర్ కాలనీల్లో ఆదివారం నిర్వహించిన ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2022 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఫారం 6 ద్వారా నూతన ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని, ఓటరు జాబితాలో పేర్లు ఉన్న వారు మార్పులు, చేర్పుల కోసం ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తులను బూత్ లెవెల్ అధికారి లేదా తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఆన్లైన్ ద్వారా https://www.nvsp.in ద్వారా కానీ Voter Helpline యాప్ ద్వారా మొబైల్ నంబర్‌తో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఒక్క నియోజకవర్గంలో ఓటు హక్కు ఉన్న వారు మరో నియోజకవర్గానికి మార్పు చేసుకోవాలంటే EPIC నంబర్ ద్వారా ఫారం 6లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓటరు జాబితాలో పేర్లు ఉన్న వారు తప్పులను సరి చేసుకొనేందుకు ఫారం 8, ఓటరు చిరునామా మార్చుకునేందుకు ఫారం 8ఏ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మృతి చెందిన వారి, డబుల్ ఓటు నమోదైన వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు ఫారం 7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలనొ పేర్కొన్నారు. ఓటరు జాబితాపై ప్రజల నుండి అభ్యంతరాలు స్వీకరించేందుకు ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపులను ఈనెల 6, 7, 27, 28 తేదీల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ సునీల్, జిల్లా కేంద్రంలోని బూత్ లెవెల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఓటరు నమోదు పరిశీలన
గణపురం: మండలంలోని లక్ష్మారెడ్డిపల్లి, కర్కపల్లి గ్రామాల 152, 153 పోలింగ్ బూత్‌లలో ఆదివారం ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలింగ్ బూత్ కేంద్రాలను తహసీల్దార్ సతీశ్ కుమార్ పరిశీలించారు. గ్రామాల్లో 18 ఏళ్లు నించిన యువతీ యువకులు విధిగా ఓటరు జాబితాల్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. బీఎల్ఓలు గ్రామాల్లో ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని అన్నారు. అర్హులందరూ ఓటు హక్కు నమోదు చేసుకునేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో బీఎల్వోలు పెంతుల శ్రీనివాస్, ఎడ్ల మాధవి, వీఆర్ఏ అశోక్ తదితరులు పాల్గొన్నారు.