కలెక్టర్ కృష్ణ ఆదిత్య
ఏటూరునాగారం, అక్టోబర్ 7: మేడారం జాతరకు సంబంధించిన ఇంజినీరింగ్ పనులు, సంబంధిత శాఖల పనుల ప్రతిపాదనను త్వరగా పూర్తి చేసి టెండర్లు నిర్వహించేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్, ఇన్చార్జి ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య ఆదేశించారు. గ్రీవెన్స్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో గురువారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూ సమస్యలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఐటీడీఏకు వార్షికంగా రావల్సిన బడ్జెట్ కేటాయింపునకు గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌కు ఫైల్ పంపించాలని సూచించారు. ఐటీడీఏ పరిధిలోని అన్ని పాఠశాలల వివరాలను డీడీ మంకిడి ఎర్రయ్యను అడిగి తెలుసుకున్నారు. వాటి నిర్వహణపై సమీక్షించారు. ఇంజినీరింగ్ శాఖలో చేపడుతున్న పనులపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు పూర్తి చేసిన వెంటనే వాటికి సంబంధించి ఫొటోలు సేకరించి బిల్లులు చెల్లించాలని, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చోటు చేసుకోకుండా చూడాలని ఈఈ హేమలతను ఆదేశించారు. ఫైళ్ల నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు. అన్ని ఫైల్స్ గ్రాంట్ల వారిగా క్రోడీకరించి ఈ-ఫైలింగ్ ద్వారా పంపించాలని సూచించారు. పాత రికార్డులన్నీ ఈ-ఫైలింగ్ విధానంలోకి మార్చాలని, అదేవిధానం పాటించాలని సూచించారు. ప్రతి విభాగంలో ఈ-ఫైల్ తప్పకుండా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఏపీవో వసంతరావు, గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ మంకిడి ఎర్రయ్య, ఐటీడీఏ ఏవో దామోదర్‌స్వామి, జీసీడీవో పద్మావతి, డిప్యూటీ డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
స్వచ్ఛ భారత్ ఆన్లైన్ ఓటింగ్‌లో పాల్గొనాలి
ములుగుటౌన్: దేశ వ్యాప్త స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2021 పథకం అమలు తీరుపై ఆన్లైన్ ఓటింగ్‌లో అందరూ పాల్గొనాలని కలెక్టర్ ఎస్.కృష్ణఆదిత్య గురువారం ఒక ప్రకటనలో కోరారు. అభిప్రాయాలను తెలియజేడానికి SSG-21 యాప్‌ను మొబైల్లో shorturl.at/ cmHN7డౌన్లోడ్ చేసుకుని ఓటింగ్‌లో పాల్గొని జిల్లాను ఆదదర్శంగా నిలుపాలని పేర్కొన్నారు.