హన్మకొండ జిల్లా వైద్యాధికారిగా
నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ములుగురూరల్, సెప్టెంబర్ 6 : ములుగు డీఎంహెచ్‌వోగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ అల్లెం అప్పయ్యకు రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సర్జన్‌గా పదోన్నతి కల్పించింది. కుటుంబ సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పయ్యకు పదోన్నతి కల్పించి హనుమకొండ జిల్లా డీఎంహెచ్‌వోగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ములుగు మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన అప్పయ్య 1999లో ములుగు ప్రభుత్వ దవాఖానలో మొదటి పోస్టింగ్‌లో వైద్యాధికారిగా విధుల్లో చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ములుగు, వెంకటాపూర్, ఏటూరునాగారం మండలాల్లో వైద్యాధికారిగా పనిచేశారు. జిల్లాలు ఏర్పడిన తర్వాత ములుగు జిల్లా డీఎంహెచ్‌వోగా నియమితులయ్యారు. కరోనా మహమ్మారి నుంచి జిల్లా ప్రజలను కాపాడేందుకు సంవత్సన్నర కాలంగా విశేష సేవలు అందిస్తున్న అప్పయ్యకు ప్రభుత్వం సివిల్ సర్జన్‌గా పదోన్నతి కల్పించింది.
కాళేశ్వరం హుండీ ఆదాయం రూ.31లక్షలు
కాళేశ్వరం, సెప్టెంబర్ 6 : పవిత్ర శ్రావణ మాసంలో భక్తుల నుంచి కానుకల రూపంలో కాళేశర, ముక్తీశ్వరస్వామి దేవస్థానానికి రూ.31,96,446 ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్య నిర్వహణాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. నెల రోజులుగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు హుండీలో కానుకలు వేశారు. సోమవారం వాటిని లెక్కించినట్లు పేర్కొన్నారు.
ద్వాదశ జ్యోతిర్లింగేశ్వరుడిగా రుద్రేశ్వరుడు
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 6: చారిత్రక వేయిస్తంభాల ఆలయంలో సోమవారం రుద్రేశ్వరుడిని ద్వాదశ జ్యోతిర్లింగేశ్వరుడి గా అలంకరించారు. ఈ సందర్భంగా స్వామి వారికి నిత్యాహ్నికం, బస్వవిలేపన అభిషేకం, బాలబోగ నివేదన, మహానీరాజన మంత్ర పుష్పాలు, సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు. సుగంధ ద్రవ్య పరిమళాలతో పెరుగన్నం కలిపి అన్నసూక్త మంత్ర పఠనయు క్తంగా ద్వాదశ జ్యోతిర్లింగేశ్వరుడిగా అలంకరించారు.