ఏటూరునాగారం, సెప్టెంబర్ 6 : అన్ని శాఖల్లో ఈ-ఫైలింగ్ ద్వారా రికార్డులు భద్రపర్చాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం వివిధ విభాగాల్లోని అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతి ఫైల్‌ను ఈ-ఆఫీస్‌లో స్కానింగ్ ద్వారా పంపించాలని సూచించారు. ఉద్యోగులంతా స్థానికంగా ఉండాలని, తప్పకుండా ములుగు-వెలుగు యాప్‌లో అటెండెన్స్ నమోదు చేసుకోవాలని సూచించారు. గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఉపస్థితిని ప్రతి రోజూ పర్యవేక్షించి తనకు పంపించాలని ఏసీఎంవోలను ఆదేశించారు. ఐటీడీఏకు చెందిన ఆస్తులన్నింటి వివరాలు ఫొటోలతో ఈ ఫైల్ ద్వారా తనకు పంపించాలని కలెక్టర్ అన్నారు. ఎకనామికల్ సపోర్టు స్కీమ్ కింద ప్రతిపాదనలను కమిషనర్‌కు పంపించినట్లు తెలిపారు. ఇంజినీరింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విభాగాలు, రికార్డు రూంలను ఆకస్మిక తనిఖీలు చేపట్టిన కలెక్టర్ రికార్డులను ఈ-ఫైలింగ్ ద్వారా స్కానింగ్ చేసి భద్రపర్చాలని సంబంధిత అధికారులకు సూచించారు. అన్ని ఫైళ్లను బందోబస్తుగా భద్రపర్చాలన్నారు. ఐటీడీఏ పరిధిలో 20 పెట్రోల్ బంకులు మంజూరు చేశారని, ఇందులో కొన్ని ప్రారంభించినట్లు తెలిపారు. కొన్నింటికి అవసరమైన స్థల సేకరణ చేపట్టాలని తహసీల్దార్లకు సూచించారు. సమీక్షలో అడిషనల్ కలెక్టర్ ఆదర్శ సురభి, ఏపీవో వసంతరావు, డీడీ మంకిడి ఎర్రయ్య, ఏవో దామోదర్‌స్వామి, గిరిజన సంక్షేమశాఖ ఈఈ హేమలత, జీసీసీ డివిజనల్ మేనేజర్ ప్రతాప్‌రెడ్డి, స్టాటిస్టికల్ ఆఫీసర్ రాజ్‌కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వో మంకిడి వెంకటేశ్వర్లు, ఏసీఎంవో సారయ్య పాల్గొన్నారు.