దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ
గ్రామాల సమగ్రామాభివృద్ధికే ‘పల్లెప్రగతి’
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
బచ్చన్నపేట, జూలై 6 : సీఎం కేసీఆర్ పాలన ప్రపం చానికే ఆదర్శంగా నిలిచిందని, రాష్ట్రంలో అమలు చేస్తు న్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకుంటున్నారని జనగామ ఎ మ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. హరితహారంలో భాగంగా మంగళవారం మండలంలోని బచ్చన్నపేట-బసిరెడ్డిపల్లి బీటీరోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముత్తిరెడ్డి మాట్లాడుతూ అధికారులు, నాయకులు హరితహారం విజయవంతానికి చేస్తున్న కృషిని అభినందించారు. ప్రతిపల్లె నేడు పచ్చని చెట్లతో కళకళలాడుతున్నదన్నారు. పల్లెల సమగ్రాభివృద్ధికి చేపట్టిన పల్లెప్రగతితో నేడు గ్రామాల రూపురేఖలు మారుతున్నాయన్నారు.ఒకప్పుడు కరువు, దుర్భిక్షంతో అల్లాడిన ఈ ప్రాంతం గోదావరి జలాలతో పునీతమైందని, దీంతో బోరు బావుల్లో భూగర్భ జలాలు పెరిగి పంటలు సమృద్ధిగా పండుతున్నాయని అన్నారు. రైతులు అభివృద్ధి చెందడంతోపాటు దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే వెల్లడించిందన్నారు. గతంలో కొందరు ‘మిషన్ కాకతీయ’పై ఆరోపణలు చేశారని, కానీ నేడు చెరువుల్లో గోదావరి జలాలతో నిండుకుండలా మారి ఊరికి ఆదెరువయ్యాయన్నారు.
ఒకప్పుడు నియోజకవర్గంలోని 102 గ్రామాల్లో 2,750 బోర్లు వేస్తే కేవలం 150 బోర్లలో నీళ్లు పడ్డాయని అన్నారు. నేడు ‘మిషన్‌భగీరథ’తో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నామన్నారు. ఈ పథకాన్ని ఇతర రాష్ర్టాలు స్ఫూర్తిగా తీసుకుంటున్నాయని ముత్తిరెడ్డి వివరించారు. గత ప్రభుత్వాల పాలనలో 125 ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకులను నేడు 300 వరకు నిర్మించామన్నారు. ఎన్నికల ముందు చెప్పని పథకాలను అమలు చేస్తున్నామని ఇందులో ‘కల్యాణలక్ష్మి, షాదీముబారక్’లో లబ్ధిదారులకు రూ.లక్షా 116 అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతుబంధు పథకంతో ఎకరాకు ఏడాదిలో రూ.10 వేలు, రైతుబీమాలో మృతుడి కుటుంబానికి రూ.5 లక్షలు అందిస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనన్నారు. దళితసాధికారిత కార్యక్రమం ద్వారా దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు వినూత్న పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని ముత్తిరెడ్డి వివరించారు.
అవగాహన లేకే గల్లీ లీడర్ల విమర్శలు
సీఎం కేసీఆర్ సహకారంతో నేడు జనగామ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుంటే అవగాహన లేని కొందరు గల్లీ లీడర్లు అర్థరహిత విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. రాష్ట్రంలోని పథకాలను ప్రధాని మోదీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మెచ్చుకుంటుంటే, ఆదే పార్టీలోని గల్లీ లీడర్లు చౌకబారు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మీఅంజయ్య, ఎంపీపీ బావండ్ల నాగజ్యోతీకృష్ణంరాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు సతీశ్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్, ఎంపీడీవో రఘురామకృష్ణ, మండల ప్రత్యేకాధికారి రాజేంద్రప్రసాద్, ఉప సర్పంచ్ హరికృష్ణ, ఎంపీటీసీలు వేణుగోపాల్, రాధ, నాయకులు గంధమల్ల నరేందర్, షబ్బీర్, వినోద్, శేఖర్‌రెడ్డి, జిల్లా సందీప్, జావీద్, ఫిరోజ్, అజీం, బొమ్మెన ఆంజనేయులు, సిద్ధులు, పీఆర్ డీఈ శ్రీనివాస్, ఏఈ శ్రీనివాస్, ట్రాన్స్‌కో డీఈ మల్చూర్‌నాయక్, ఏడీఈ అర్జున్పమార్, ఏఈ సత్తయ్య పాల్గొన్నారు.