వరంగల్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అత్యాధునిక హంగులతో సిద్ధమైన వరంగల్ కోర్టుల భవన సముదాయం ఈ నెల 19న ప్రారంభం కానుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చేతుల మీదుగా కొత్త భవనం ప్రారంభోత్సవం జరుగనుంది. సీజేఐ పర్యటన కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నందికొండ నర్సింగరావు, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి, హనుమకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కోర్టు భవన ప్రారంభోత్సవ కార్యక్రమం మొదట ఈ నెల 18న అనుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటన షెడ్యూల్లో స్వల్ప మార్పుల నేపథ్యంలో ఈ నెల 19న ఖరారైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.21.65 కోట్లతో వరంగల్ కోర్టుల కోసం నూతన భవనాన్ని నిర్మించింది. 1.23 లక్షల చదరపు ఫీట్ల విస్తీర్ణంతో జీ ప్లస్ త్రీ పద్ధతిలో కొత్త భవనం ఉంది. కింద పార్కింగ్, ఇతర వసతులతోపాటు ప్రతి అంతస్తులో 30,995 చదరపు ఫీట్ల విస్తీర్ణంతో భవనాన్ని నిర్మించారు. ఫ్యామిలీ కోర్టు, పోక్సో ప్రత్యేక కోర్టు ఆవరణలను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఫ్యామిలీ కోర్టుకు వచ్చే వారిని దృష్టిలో పెట్టుకుని పిల్లలు ఆడుకోవడానికి మినీ పార్కు, ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. భార్యాభర్తల కౌన్సెలింగ్ కోసం రెండు హాళ్లను సిద్ధం చేశారు. లైంగిక దాడి బాధితుల కోర్టు మిగిలిన వాటికి భిన్నంగా ఉంటుంది. కోర్టు వాతావరణం కనిపించకుండా, నిందితులు, ఇతర సాక్షులు… బాధితులకు కనిపించకుండానే విచారణ ప్రక్రియ జరిగేలా ఈ కోర్టుకు ప్రత్యేకంగా ద్వారాలను నిర్మించారు. మొదటి అంతస్తులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, గవర్నమెంట్ ప్లీడర్లు, జడ్జిల మీటింగ్ హాలు, లైబ్రరీ, సెంట్రల్ రూంలు, మహిళలు, పురుషులకు ప్రత్యేకంగా బార్ అసోసియేషన్, సెంట్రల్ నజరాత్, వెయిటింగ్ హాళ్లు, లాబీలు ఉన్నాయి. రెండు, మూడో అంతస్తులో ఐదు చొప్పున కోర్టు హాళ్లు, జడ్జిల డయాస్‌లు, చాంబర్లు, స్టెనోగ్రాఫర్లు, వెయిటింగ్ హాళ్లు, కోర్టుల సమాచార హాళ్ల వంటివి ఉన్నాయి. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కరంటు, డ్రైనేజీ, నీటి వసతి కల్పించారు. సాంకేతికంగా అన్ని వ్యవస్థలను సమకూర్చునేలా వరంగల్ కోర్టుల భవన సముదాయం నిర్మాణం ఉంది. నూతన కాకతీయ కళాతోరణం చూడ ముచ్చటగా ఉంది.