ఆరు జిల్లాలకు కలిపి రూ.34 కోట్లు
హామీ నిలబెట్టుకున్న ఎమ్మెల్సీ పోచంపల్లి
సీఎంకు, మంత్రి ఎర్రబెల్లికి కృతజ్ఞతలు
వరంగల్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);స్థానిక సంస్థలను బలోపేతం చేయడం లక్ష్యంగా జిల్లా ప్రజా పరిషత్‌లకు, మండల ప్రజాపరిషత్‌లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వరంగల్ ఉమ్మడి జిల్లాకు రూ.34.25 కోట్లను ఇచ్చింది. ఈ నిధులతో స్థానిక సంస్థల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జరగనున్నాయి. జడ్పీపీలు, ఎంపీపీలకు నిధుల విడుదలపై స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రతిపాదనతో రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో ఎంపీటీసీలు, జడ్పీటీసీల ఆధ్వర్యంలో పనులు జరుగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలతో నిధుల పరంగా ప్రాధాన్యత తగ్గిన ఎంపీపీలు, జడ్పీపీలకు రాష్ట్ర ప్రభు త్వం దశల వారీ గా గ్రాంట్లను విడుదల చేస్తోం ది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.250 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎంపీపీలకు రూ.17 కోట్లు, జెడ్పీపీలకు రూ.17.25 కోట్లు వచ్చాయి. గ్రాంట్లతో వెంటనే అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్‌లను ఆదేశించింది. జిల్లా పరిషత్‌ల వారీగా నిధుల ఖర్చుపై నెలవారీ నివేదికలు పంపించాలని, పనులకు సంబంధించిన పురోగతిని నివేదించాలని స్పష్టం చేసింది. స్థానిక సంస్థలకు నిధుల విడుదలపై వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నిధుల విడుదల చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నిధుల విడుదలలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావుల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిధులు జడ్పీపీలు, ఎంపీపీల బలోపేతానికి ఉపయోగపడతాయని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ స్థానిక సంస్థలకు తగిన నిధులు ఇస్తున్నారని చెప్పారు. నిజమైన గ్రామ స్వరాజ్యం కోసం సీఎం కేసీఆర్ పట్టుదలతో పని చేస్తున్నారని అన్నారు.