జిల్లాలో మొదటి డోస్ వ్యాక్సినేషన్ 91 శాతం పూర్తి
పోషకాహార లోపం ఉన్న చిన్నారులకు పౌష్టికాహారం అందించండి
కలెక్టర్ కృష్ణ ఆదిత్య
వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సమీక్ష
భూపాలపల్లి రూరల్, అక్టోబర్ 4 : నిర్ణీత సమయానికి కొవిడ్ రెండో డోస్ తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం సింగరేణి ఇల్లందు క్లబ్ హౌస్‌లో వ్యాక్సినేషన్‌పై వైద్య ఆరోగ్యశాఖ, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో పని చేయడం వల్ల జిల్లాలో 91 శాతం ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిందని, మిగిలిన శాతాన్ని త్వరగా పూర్తి చేయాలని అన్నారు. అలాగే సెకండ్ డోస్‌పై మంగళవారం మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించి సమయానికి ప్రజలకు రెండో డోస్ టీకా తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోషకాహార లోపం ఉంటే చిన్నారులు వయస్సు తగ్గ బరువు, ఎత్తు పెరగరని, భూపాలపల్లి, రేగొండ, మహదేవపూర్, కాటారం, చిట్యాల తదితర మండలాల్లో తక్కువ బరువు గల శిశువుల వివరాలు నమోదయ్యాయని అన్నారు. వారి వివరాలను సేకరించి అంగన్వాడీల ద్వారా అదనపు పౌష్టికాహారం అందించాలన్నారు. తద్వారా రెండు, మూడు నెలల్లో చిన్నారులు వయస్సు తగ్గ బరువుతో ఆరోగ్యంగా పెరుగుతారని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అం గన్వాడీ కేంద్రా ల్లో గర్భిణులు, బాలింతలకు రక్త పరీక్షలు నిర్వహించాలని సూచించారు. రక్తహీనతతో బాధపడే వా రిని గుర్తించి వారికి పౌష్టికాహారం, అవసరమైన మందులు అందించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత, అదనపు కలెక్టర్ దివాకర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీరామ్, ఇన్చార్జి జిల్లా సంక్షేమ అధికారి సామ్యూల్, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, వైద్యాధికారులు పాల్గొన్నారు.
గ్లూకోమీటర్లు అందజేసిన కలెక్టర్
భూపాలపల్లి టౌన్ : ప్రభుత్వం మంజూరు చేసిన గ్లూకోమీటర్లను కలెక్టర్ కృష్ణ ఆదిత్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్‌కు అందజేశారు. మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం ప్రభుత్వం జిల్లాకు 300 గ్లూకోమీటర్లను మంజూరు చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న ఏఎన్ఎంలు 40 ఏండ్లు పైబడిన వారందరికీ షుగర్ పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం ఈ మీటర్లను అందించింది. వీటిని జాగ్రత్తగా ఉపయోగించి షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేసేలా చూడాలని కలెక్టర్ కోరారు.