పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు
పులిచర్మం, గోర్లు, కళేబరం స్వాధీనం
అడవి జంతులను వేటాడితే కఠిన చర్యలు
ములుగు ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ వెల్లడి
ములుగు, అక్టోబర్ 3 (నమస్తేతెలంగాణ) : కొడిశాల అటవీ ప్రాంతంలో ఉచ్చులు పెట్టి పెద్దపులిని హతమార్చిన ఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ములుగు ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ తెలిపారు. పులి చర్మం, గోర్లు అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో నిందితులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆయన వెల్లడించారు. ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఆవరణలో అటవీ శాఖ వరంగల్ సర్కిల్ సీసీఎఫ్ ఎస్జే ఆశతో కలిసి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. పులులు అంతరించిపోతున్న సమయంలో వాటిని కాపాడాల్సిన బాధ్యత సమాజంలో అందరిపై ఉందన్నారు. అడవి జంతువులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఆవాసం కోసం చత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి వచ్చిన పెద్ద పులిని అతి క్రూరంగా వేటాడి చంపిన వేటగాళ్లనును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఆవరణలో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ అటవీ శాఖ వరంగల్ సర్కిల్ సీసీఎఫ్ ఎస్జే ఆశతో కలిసి ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. ఈ నెల 2వ తేదిన సాయంత్రం తాడ్వాయి పోలీసులకు అందిన సమాచారం మేరకు పులిని చంపి దాని గోర్లను, చర్మాన్ని అమ్మేందుకు కొందరు చత్తీస్‌గఢ్ వెళ్తున్నారని పక్కా సమాచారం అందింది. దీంతో చత్తీస్‌గఢ్ వెళ్లే అన్ని రహదారుల్లో అటవీ శాఖ అధికారుల సహాయంతో వాహనాల తనిఖీ చేపట్టారు. ఆదివారం ఉదయం కాటాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద సీజీ 17 సీ 0535 నంబర్ గల కారులో నలుగురు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో కనిపించారు. వారి వాహనాన్ని తనిఖీ చేయగా అందులో పులి గోరు కనిపించగా వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో భాగంగా తాడ్వాయి మండలం కొడిశాల గుంపునకు చెందిన మడవి నరేశ్, మడవి ఇరుమయ్య, మడకం ముకేశ్, మడవి దేవా అనే నలుగురు గొత్తికోయగూడేనికి చెందిన వ్యక్తులు కూలి పని చేస్తుండే వారని ఎస్పీ తెలిపారు. కూలి పనితో డబ్బులు సరిపోకపోవడంతో అడవి జంతువులను వేటాడి వాటి మాంసం, చర్మం విక్రయించాలనే దురాశతో అటవీ ప్రాంతంలో ఉచ్చులు పెట్టే వారని తెలిపారు. ఈ క్రమంలో కొడిశాశల అటవీ ప్రాంతంలో పెద్దపులి తిరుగుతున్నదని తెలిసి దానిని హతమార్చి చర్మం, గోర్లు అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో ఉచ్చులు పెట్టారని ఆయన తెలిపారు. పై నలుగురు వ్యక్తులు పులి కోసం పెట్టిన ఉచ్చులో సెప్టెంబర్ 21వ తేదీన పులి చిక్కుకుని చనిపోయినట్లు గమనించారని తెలిపారు. దానిని అదే గొత్తికోయగూడేనికి చెందిన మడకం రామ, మడకం ఉంగయ్య, కోవాసి ఇడ్మాలతో కలిసి అడవిలో దాచిపెట్టారు. పోలీస్ విచారణలో వారు తెలిపిన ఘటనా స్థలానికి తాడ్వాయి ఎఫ్‌డీవో, వెటర్నరీ డాక్టర్‌తో కలిసి చేరుకొని పరిశీలించగా వెటర్నరీ డాక్టర్ అది పులి శరీర భాగాలని ధృవీకరించినట్లు తెలిపారు. పులి చర్మం, గోర్లు, కళేబరం, ఎముకలు, వేటాగాళ్లు ఉపయోగించిన ఉచ్చులను స్వాధీనం చేసుకొని మడకం నరేశ్, మడవి ఇడుమయ్య, మడవి దేవాలతో పాటు చింతల కాటాపూర్‌కు చెందిన మడకం ముకేశ్, మడవి గంగయ్యపై వన్య ప్రాణి చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
అడవి జంతులను వేటాడితే కఠిన చర్యలు
గడిచిన 21 ఏళ్లలో ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం లేదన్నారు. ఇటీవలి కాలంలో తిరిగి పులులు సంచరించడం శుభపరిణామంగా భావిస్తున్న క్రమం లో దానిని ఉచ్చు పెట్టి చంపడం దారుణమని ఎస్పీ సంగ్రామ్సింగ్జీపాటిల్ అన్నారు. పులులు అంతరించిపోతున్న సమయంలో వాటిని కాపాడాల్సిన బాధ్యత సమాజంలో అందరిపై ఉందన్నారు. వన్య ప్రాణుల పరిరక్షణకు ములుగు జిల్లా పోలీస్ శాఖ తరుపున సహాయ, సహాకారాలు అందించనున్నట్లు తెలిపారు. ఇకపై ఎవరైనా అటవీ జంతులను వేటాడినట్లయితే చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు.
గొత్తికోయలు ఉచ్చు పెట్టారు : వరంగల్ సీసీఎఫ్
ఆగస్టు 1వ తేదీన పెద్ద పులి జాడలను మొదటి సారిగా తాడ్వాయి అటవీ ప్రాంతంలో పాద ముద్రల ద్వారా గుర్తించామని వరంగల్ సీసీఎఫ్ ఎస్జే ఆశ అన్నారు. దాని సంరక్షణ కోసం అటవీ శాఖ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకున్నా పోడు వ్యవసాయం చేసుకునే గొత్తికోయలు కుట్ర పన్ని పెద్దపులిని చంపాలనే ఉద్దేశంతో ఉచ్చులు పెట్టి హతమర్చారన్నారు. పెద్ద పులి కదలికలు ములుగు, మహబూబాబాద్, కొత్తగూడెం,వరంగల్‌రూరల్ జిల్లాలో ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు పులి కదలికలపై ఎప్పటికప్పుడు పర్యావేక్షణ చేశారని అన్నారు. పెద్ద పులి కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు నాలుగు జిల్లాల అటవీ శాఖ అధికారులను సమన్వయపరుస్తూ అటవీ ప్రాంతంలో గస్తీని మరింత బలోపేతం చేశామన్నారు. నిఘాను పటిష్ట పర్చుతూ అటవీ సిబ్బంది బేష్ క్యాంపు వాచర్లు, అనిమల్ ట్య్రాకర్స్తో అటవీ ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేస్తూ కెమెరా ట్రాప్లను సైతం అమర్చినట్లు తెలిపారు. చనిపోయిన పులి నాలుగేళ్ల వయస్సు కలిగిన ఆడ పులి అని తెలిపారు. సమావేశంలో ములు గు ఏఎస్పీ పోతరాజు సాయిచైతన్య, ములుగు ఇన్చార్జీ డీఎఫ్‌వో శివ ఆశిస్, తాడ్వాయి ఎఫ్‌డీవో ప్రశాంత్‌పాటిల్, ములుగు ఎఫ్‌డీవో జోగేంద్ర, పస్రా సీఐ శంకర్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, కరుణాకర్‌రావు, వెటర్నరీ డాక్టర్ ప్రవీణ్‌కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాగా, పెద్ద పులిని వేటాడి హతమార్చిన 20 నుంచి 25 సంవత్సరాల వయస్సు కలిగిన నలుగురు నింధితులను స్వాధీనం చేసుకున్న కారులో తీసుకువచ్చి అరెస్టు చూపకుండా పులిని హతమార్చిన ఘటనను, కళేబారాలను చూపడం చర్చనీయాంశంగా మారింది.