అహ్మదాబాద్: ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను ఒడిసిపట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీమ్ఇండియా గ్రూపు దశలో ఆఖరి పోరుకు సిద్ధమైంది. బుధవారం నెదర్లాండ్స్‌తో భారత్ తలపడనుంది. అమెరికా, నమీబియా, పాకిస్థాన్‌పై వరుస విజయాలతో మంచి దూకుడు మీదున్న సూర్యకుమార్‌యాదవ్ సేన ఇప్పటికే సూపర్-8 బెర్తు దక్కించుకుని కప్ వేటలో మరో అడుగు వేసింది. అంతర్జాతీయ క్రికెట్లో అంతగా అనుభవం లేని నెదర్లాండ్స్‌ను ఓడించి కీలకమైన సూపర్-8కు ముందు ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకోవాలని చూస్తున్నది. అయితే గత మూడు మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా బ్యాటర్లు స్పిన్నర్లను ఎదుర్కొవడంలో ఒకింత ఇబ్బందులు పడ్డారు.
నమీబియా కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్‌తో పాటు గత మ్యాచ్‌లో పాక్ స్పిన్నర్లు ఉస్మాన్ తారిఖ్, సయిమ్ ఆయూబ్ బౌలింగ్‌లో పరుగులు రాబట్టడంలో అంతగా సఫలం కాలేకపోయారు. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్ మ్యాచ్ ద్వారా ఆ లోపాలను సరిదిద్దుకునే పనిలో పడ్డారు. మంగళవారం మోతెరా స్టేడియంలో జరిగిన నెట్ ప్రాక్టీస్‌లో యువ బ్యాటర్లు తిలక్‌వర్మ, రింకూసింగ్‌కు చీఫ్ కోచ్ గౌతం గంభీర్ సూచనలు ఇస్తూ కనిపించాడు. ఇదిలా ఉంటే స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చే చాన్స్ కనిపిస్తుండగా, సిరాజ్, అర్ష్దీప్సింగ్తో అటాకింగ్ చేయనుంది. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న అభిషేక్‌శర్మ ఈ మ్యాచ్‌లోనైనా ఖాతా తెరుస్తాడా అన్నది చూడాలి.