ఢిల్లీ: పాకిస్థాన్ మాజీ ప్రధాని, ఆ దేశ క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తున్నదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో మద్దతు దక్కుతున్నది. ఇమ్రాన్‌కు సరైన చికిత్స అందించాలని కోరుతూ 14 మంది మాజీ సారథులు పాక్ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. భారత మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ సహా మైఖెల్ అథర్టన్, అలెన్ బోర్డర్, మైఖెల్ బ్రేర్లీ, గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్, బెలిందా క్లార్క్, డేవిడ్ గోవర్, కిమ్ హ్యూగ్స్, నాసిర్ హుస్సేన్, ైక్లెవ్ లాయిడ్, స్టీవ్ వా, జాన్ రైట్ లేఖ రాసినవారిలో ఉన్నారు. ఇమ్రాన్ ప్రస్తుతం ఓ అవినీతి కేసులో అరస్టై రావల్పిండి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
‘ఇమ్రాన్ నాయకత్వం, క్రీడా స్ఫూర్తి ఎందరికో ఆదర్శం. క్రికెట్లో అత్యున్నత ఆల్రౌండర్లలో ఆయన ఒకరు. మాలో చాలా మంది ఆయనకు వ్యతిరేకంగా ఆడాం. ఆయన క్రికెట్ నైపుణ్యానికి ఆరాధ్యులైనవారమూ ఉన్నాం. క్రికెట్లోనే గాక పాకిస్థాన్ అత్యంత కఠిన సవాళ్లు ఎదుర్కుంటున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యయుతంగా ఆయన ప్రధాని పదవిని చేపట్టి ప్రజలకు సేవలందించారు. కానీ ఆయన ఆరోగ్యం గురించి ఇటీవల వెలువడుతున్న వార్తలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని లేఖలో కోరారు.