చెన్నై: టీ20 ప్రపంచకప్‌లో తమ చివరి లీగ్ మ్యాచ్‌ను న్యూజిలాండ్ ఘనవిజయంతో ముగించింది. గ్రూప్-డీలో భాగంగా చెన్నై వేదికగా కెనడాతో జరిగిన పోరులో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ప్రత్యర్థి నిర్దేశించిన 174 పరుగుల ఛేదనను కివీస్ 15.1 ఓవర్ల రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి బాదేసింది. గ్లెన్ ఫిలిప్స్ (36 బంతుల్లో 76 నాటౌట్, 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) వీరబాదుడుకు తోడు రచిన్ రవీంద్ర (39 బంతుల్లో 59, 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) సమయోచిత అర్ధశతకంతో రాణించారు.
మొదట కెనడా యువ సంచలనం యువరాజ్ సమ్ర (65 బంతుల్లో 110, 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) రికార్డు శతకంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 173/4 చేసింది. టీ20 ప్రపంచకప్‌లో అతిపిన్న వయసు (19 ఏండ్ల 141 రోజులు)లోనే సెంచరీ చేసినవారిలో యువరాజ్.. పాక్ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ (22 ఏండ్ల 127 రోజులు) రికార్డును అధిగమించాడు. అదీగాక అసోసియేట్ దేశాల నుంచి సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గానూ అతడు రికార్డులకెక్కాడు. ఇక ఈ విజయంతో న్యూజిలాండ్ గ్రూప్-డీలో దక్షిణాఫ్రికా తర్వాత రెండో సూపర్-8 బెర్తును దక్కించుకుంది. ఆఫ్ఘానిస్థాన్, యూఏఈ, కెనడా రేసు నుంచి నిష్క్రమించాయి.