నేటి నుంచి కాజీపేట దర్గా ఉత్సవాలు
మూడు రోజుల పాటు నిర్వహణ
మత సామరస్యానికి ప్రతీకగా విలసిల్లుతున్న ప్రాంతం
ప్రపంచంలోని మూడు ఆకుపచ్చ దర్గాల్లో ఒకటి
వరంగల్, అక్టోబరు 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;ప్రపంచంలోని మూడు ఆకుపచ్చ దర్గాలో ఒకటిగా ప్రత్యేకత ఉన్న కాజీపేట బియాబానీ దర్గాలో నేటి నుంచి ఉర్సు ప్రారంభం కానుంది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఉత్సవాలు మొదలవనున్నాయి. అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు, సికులు ఇక్కడికి వస్తుండగా, ఈ దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నది. వరాలు కురిపించే ఉర్సుకు సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. ప్రధాన ఘట్టం సంధల్ ఊరేగింపు.. చివరి రోజు ఫకీర్ల విన్యాసాలు ఒళ్లుగగుర్పొడేలా సందర్శకులను ఆకట్టుకోనున్నాయి.
కాజీపేటలోని హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గాలో సోమవారం రాత్రి 11.30 గంటలకు ఉర్సు మొదలవుతాయి. ఇస్లామ్ మత సంప్రదాయంలో మహిమాన్వితులుగా పేరొందిన వారి సమాధులపై దర్గాలను నిర్మిస్తారు. వారి ప్రత్యేకతని తెలిపే విధంగా ఆకుపచ్చ రంగును వేస్తారు. ప్రపంచంలో ఆకుపచ్చ రంగు ఉన్న దర్గాలు మూడూ ఉండగా, ఒకటి మక్కాలో, మరొకటి బాగ్దాద్‌లో, ఇంకోటి కాజీపేటలో ఉంది. దేశ, విదేశాల నుంచి ఇక్కడికి భక్తులు, సందర్శకులు వస్తుంటారు. వందల ఏండ్లుగా ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు, సికులు ప్రార్థించే ఏకైక దర్గాగా పేరొంది మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నది.
దర్గా ప్రత్యేకతలు..
కాజీపేటకు చెందిన సయ్యద్ గులాం మొహియుద్దీన్ బియాబానీ-ఖాసింబీ దంపతులకు హజ్రత్ సయ్యద్ అఫ్జల్ బియాబానీ 1795లో జన్మించారు. ఇతనికి చిన్నప్పటి నుంచే భక్తి భావన ఎకువ ఉండేది. 12 ఏండ్లకే ఖురాన్‌ను కంఠస్థం చేశాడు. 20 ఏళ్ల వయస్సులోనే హఫీజ్ సయ్యద్ సద్రుద్దోన్, మౌల్విక్ కుద్బుద్దీన్ గురువుల దగ్గర ఖురాన్-సున్నత్, షరియత్ ఇస్లాం మతాచారాలను నేర్చుకున్నాడు. 28వ ఏట ఇంటిని వదిలిపెట్టి మెదక్, వరంగల్ పాత జిల్లాల్లోని పలు గుట్టల్లో 12 ఏండ్లపాటు తపస్సు చేశాడు. కాజీపేట సమీపంలోని బంధం చెరువు సమీపంలోని మోదుగు అడవిలో హజ్రత్ సయ్యద్ అఫ్జల్ బియాబానీ జ్ఞానోదయాన్ని పొందాడని అఫ్జలుల్ కరామత్ గ్రంథంలో పేర్కొన్నారు. 1822లో వానలు లేక వరంగల్ ప్రాంతం తీవ్రమైన కరువు ఏర్పడడంతో బియాబానీ నమాజ్ చేసినప్పుడు వానలు పడి చెరువులు నిండి సుభిక్షంగా మారిందని ప్రతీతి. మీర్జా అఫ్జల్ బేగ్ దమ్ముతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పుడు బియాబానీ ఇచ్చిన నీళ్లతో ఆరోగ్య సమస్యలు పోయాయని స్థానికులు చెబుతారు. అప్పటి బ్రిటిష్ అధికారి కర్నల్ డేవిడ్సన్ ఇతడి గొప్పదనాన్ని తెలుసుకుని మూడు గ్రామాల జాగిర్దారీని కానుకగా ఇవ్వగా, సున్నితంగా తిరసరించాడు. 1856 సఫర్ మాసంలో 26న హజ్రత్ షా అఫ్జల్ బియాబానీ భగవంతుడిలో లీనమైన రోజున దర్గా నిర్మాణం చేపట్టారు. అప్పటినుంచి ఏటా సహర్ మాసంలో కాజీపేట దర్గా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఆయన ఆశయ సాధనను వారి కుటుంబీకులు కొనసాగిస్తున్నారు. బియాబానీ వంశంలోని ఖుస్రూపాషా దర్గా ఉత్సవాలను కొనసాగిస్తున్నారు. బియాబానీ తర్వాత ఏడో తరంలోని ఖుస్రూపాషా ప్రస్తుతం కాజీపేట దర్గా పీఠాధిపతిగా ఉన్నారు. ప్రస్తుతం ఉత్సవాల నిర్వహణ కరోనా నిబంధనల మేరకు చేస్తున్నారు.
ఉర్సు ఇలా..
కాజీపేట దర్గాలో సోమవారం రాత్రి 11.30 గంటలకు ఉర్సు(ఉత్సవాలు) మొదలవుతాయి. ప్రధాన ఘట్టం సంధల్ ఊరేగింపు. దర్గా గ్రామంలోని బడాఘర్ నుంచి పీఠాధిపతి ఖుస్రూపాషా తన తలపై గంధంతో కూడిన వెండి గిన్నె, ఆ గిన్నెపై చాదర్ (వస్త్రా లు)ను కప్పి రాత్రి 11.00 గంటలకు ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ సమయంలో డప్పుచప్పుళ్లతో బడాఘర్ మార్మోగుతుంది. ఊరేగింపునకు ముందుగా వేలాది మంది భక్తులు బారులు తీరుతారు. భక్తులు గంధం తీసుకుని వచ్చే ఘట్టం కోసం గంటల తరబడి వేచి చూస్తారు. తలపై గంధంతో మేళతాళాల మధ్య దర్గాలోనికి వెళ్తున్న దర్గా పీఠాధిపతిని, ఆయన తలపై ఉన్న గంధంతో ఉన్న వెండి గిన్నెను తాకడానికి భక్తులు పోటీపడతారు. ఆ గంధం గిన్నెను తాకితే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఆ రోజు ఉదయం వరకు ఖవ్వాలి వినిపిస్తారు. మంగళవారం ఉర్సు జరుగుతుంది. బుధవారం బదావా పేరుతో ఉర్సు ముగింపు ఉంటుంది. ముగింపు కార్యక్రమంలో ఫకీర్ల విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా సందర్శకులను ఆకట్టుకునేలా ఉంటాయి.
ఎంతో సంతృప్తి
కాజీపేట దర్గాకు మూడు వందల ముప్పై ఏండ్ల చరిత్ర ఉంది. మంచితనం పెంచడం జీవన విధానంగా మార్చుకున్న హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ స్ఫూర్తిని కొనసాగించడం లక్ష్యంగా ఈ దర్గాను నిర్మించారు. ఏడో తరంలో నాకు దర్గా సజ్జాక్(పీఠాధిపతి)గా అవకాశం దక్కింది. ఎంతో పుణ్యం చేసుకోవడం వల్ల నాకు ఈ అదృష్టం దక్కింది. ఈ దర్గాపై అందరికీ విశ్వాసం ఉంది. అదే పరంపర కొనసాగుతోంది. అందరూ దీన్ని శాంతి కేంద్రంగా, పుణ్యస్థలంగా భావిస్తారు.