భూపాలపల్లి, సెప్టెంబర్ 2: కరోనా వైరస్ కట్టడికి, కరోనా సోకిన సింగరేణియులకు సింగరేణి ఏరియా దవాఖాన డాక్టర్లు, వైద్య సిబ్బంది విస్తృతంగా అందించిన వైద్య సేవలు అభినందనీయమని భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం శ్రీనివాసరావు అన్నారు. గురువారం భూపాలపల్లి ఏరియా దవాఖానలో భారత్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ప్రోత్సాహక బహుమతులను జీఎం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నదన్నారు. దీనిని సింగరేణి సంస్థ సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. సింగరేణి డాక్టర్లు, వైద్యసిబ్బంది కరోనా సోకిన రోగులకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ సేవలు అందించారని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ చివరి దశలో ఉందని, రాబోయే థర్డ్ వేవ్‌ను కూడా అదుపులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లను చేసుకున్నామని అన్నారు. కొవిడ్ రోగులకు వైద్యసేవలు అందించిన కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు జీఎం జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఏరియా సింగరేణి అధికార ప్రతినిధి అజ్మీరా తుకారాం, డీవైసీఎంవో డాక్టర్ ఎస్.పద్మజ, సీనియర్ పీవో రాజేశం, డాక్టర్లు శైలజ, గోపికృష్ణ, ఎం.రవికాంత్, సురేఖ, ఎన్.అనల, సుష్మిత, స్టాఫ్ నర్సులు జీవకుమారి, రేవతి, కౌసర్‌బాను, ఫార్మాసిస్టు సురేందర్, ల్యాబ్ టెక్నీషియన్ ప్రవీణ్, ఎక్స్‌రే టెక్నీషియన్ పర్వేజ్ పాల్గొన్నారు.