ఒక్కో నిర్మాణానికి రూ.22లక్షలు
జిల్లాలో పూర్తయిన 62 రైతువేదికలు
సాగుపై రైతులకు అవగాహన
రైతుల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం కృషి
వారంలో రెండు రోజులు సాగుపై శిక్షణ
పాలకుర్తి రూరల్, సెప్టెంబర్ 2 : రైతును రాజు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దీనికి తోడు వ్యవసాయాన్ని పండుగలా మార్చడంతో పాటు రాష్ట్రంలో రైతు రాజ్యం తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. కొన్ని గ్రామాలను క్లస్టర్‌గా ఏర్పాటు వేసి అందులో రైతువేదికలు నిర్మించారు. రైతుల సాగు కష్టాలు తీర్చడంతో పాటు ఏ పంటలు సాగు చేయాలి? ఎప్పుడెప్పుడు ఏఏ మందులు వాడాలి? అనే అంశాలపై ఈ కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారులు సలహాలు ఇవ్వనున్నారు. రైతును ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ వేదికలు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం వారికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. ఇప్పటికే వ్యసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తున్న ప్రభుత్వం, రైతుబంధు, రైతుబీమాతో ఆదుకుంటున్నది. దీనికి తోడు ఇంతకాలం పంటల సాగు, రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చెప్పేటోళ్లు లేక అన్నదాత ఆగమాగం అయ్యేది. దీనిని గుర్తించిన కేసీఆర్ కొన్ని గ్రామాలను కలిపి క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టర్లో ఒక రైతు వేదికను నిర్మించేలా చర్యలు చేపట్టారు. ఏ పంటలు పండిస్తే లాభం. ఏ పంటకు ఏ మందు పిచికారీ చేయాలి రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఎంత. ఇలాంటి సమస్యలపై రైతులు చర్చించుకోవడానికి ఉపయోగ పడేలా రైతు వేదికలు నిర్మించారు.
జిల్లాలో 62 వేదికలు
జిల్లా వ్యాప్తంగా 62 రైతు వేదికల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాలకుర్తి సబ్ డివిజన్లో 15 రైతు వేదికలు నిర్మిస్తున్నారు. పాలకుర్తి మండలంలో 7, దేవరుప్పులలో 5, కొడకండ్లలో3 వేదికలు నిర్మిస్తున్నారు. జనగామ నియోజక వర్గంలో 21, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో 26 రైతు వేదికలను నిర్మించారు. జనగామ నియోజక వర్గంలో నిర్మించిన వేదికను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రారంభించగా, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజయ్య ప్రారంభించారు. జనగామలో 7, బచ్చన్నపేట 7, నర్మెట 4, తరిగొప్పుల 3, స్టేషన్ ఘన్‌పూర్‌లో 6, రఘునాథపల్లిలో 7, లింగాల ఘనపూర్‌లో 4, చిల్పూరులో 4, జఫర్‌గఢ్‌లో 5 మంజూరు చేశారు. ఈ వేదికల నిర్మాణాలకు గతేడాది జూన్ 7న రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కలెక్టర్ నిఖిల పాలకుర్తిలో భూమి పూజ చేశారు. దసరా నాటికి నిర్మాణాలు పూర్తి కావాలని మంత్రి ఎర్రబెల్లి కాంట్రాక్టర్లను ఆదేశించడంతో గడువులోపు పూర్తి చేశారు. ఒక్కో రైతు వేదికకు ప్రభుత్వం రూ.22 లక్షలు మంజూరు చేసింది. ఎన్ఆర్ఈజీఎస్ నుంచి రూ.10 లక్షలు మంజూరవగా ప్రభుత్వం రూ. 12 లక్షలు మంజూరు చేసింది. ఈ క్రమంలో జిల్లాలోని 62 రైతు వేదికలకు మొత్తం రూ.13.64కోట్లు మంజూరు చేసింది. దీంతో రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించి రైతులకు సాగుపై ప్రతి మంగళ, శుక్రవారాలు అవగాహన కల్పిస్తున్నారు. మద్దతు ధర, నూతన వ్యవసాయ విధానాలపై సమాచారం అందిస్తున్నారు.
పని భారం తగ్గింది
రైతు వేదికల నిర్మాణంతో పనిభారం తగ్గింది. ఇందులో సమావేశాలు నిర్వహించి రైతులందరికీ ఒకే చోట అవగాహన కల్పిస్తున్నాం. రైతు కూడా సమావేశాల కు హాజరై సలహాలు పాటిస్తున్నారు. విత్తనా లు, ఎరువులు రైతు వేదికల నుంచే పంపిణీ చేస్తున్నాం. పంటల వివరాల నమోదు చేసుకుంటున్నాం. రైతు వేదికలతో రైతులు సైతం నేరుగా వచ్చి సమస్యలు విన్నవిస్తున్నారు.
-చింతం సరిత కుమారి,
ఏఈఓ ముత్తారం సమస్యల పరిష్కారానికే వేదికలు
రైతు వేదికల్లో సమస్యలు నేరుగా పరిష్కారమవుతాయి. రైతులంతా ఒక్క చోట సమావేశమై సమస్యలపై చర్చించుకోవచ్చు. పంట సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కారం దొరుకుతది. ఏఈవోలు రైతు వేదికల్లో అందుబాటులో ఉంటారు. పంటలకు మద్దతు ధర, ఎరువుల వివరాలు తెలుసుకోవచ్చు.
-తక్కొలు రాధికరావు, డీఏవో జనగామ
కర్షక దేవాలయాలు రైతు వేదికలు
రైతు వేదికలు కర్షక దేవాలయాలు. తెలంగాణను అన్నపూర్ణగా మార్చాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. సమైక్య పాలనలో వ్యవసాయం దండగ అంటే సీఎం కేసీఆర్ దానిని పండుగలా మార్చారు. రైతును రాజు చేయడమే ప్రభుత్వం ధ్యేయం. కరోనా కష్టకాలంలోనూ రైతులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
-ఎర్రబెల్లి దయాకర్‌రావు, మంత్రి