జిల్లాలో 281 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు పూర్తి
మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలి
ప్రతి పాఠశాలలో కొవిడ్ నిబంధనలు తప్పనిసరి
అధికారులతో కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య
జనగామ చౌరస్తా, సెప్టెంబర్ 2 : అధికారులు అంకితభావం, క్రమశిక్షణతో పని చేయాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల పరంగా చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు, చేపట్టిన పనుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు తమ నివేదికలో పొందుపర్చిన ప్రకారంగా క్షేత్రస్థాయిలో ప్రగతి కన్పించాలన్నారు. జిల్లాలో 281 వైకుంఠ ధామాల నిర్మాణానికి 278 పూర్తికాగా, 3 చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయని, పూర్తయిన 244 వైకుంఠధామాలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. మిగతా చోట్ల ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. 281 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు పూర్తి అయ్యాయని, మొక్కల సంరక్షణపై ప్రత్యే దృష్టి పెట్టాలన్నారు. అన్ని గ్రామాల్లో నర్సరీల ఏర్పాటు పూర్తయ్యాయని, డిమాండ్ మేరకు మొక్కల పెంపకానికి చర్యలు చేపట్టాలి పేర్కొన్నారు. ఈ ఏడాది 33.53 లక్షల మొక్కలు నాటే లక్ష్యం ఇవ్వగా, ఇప్పటికి 77శాతం మొక్కలు నాటారని, లక్ష్యాన్ని వారం రోజుల్లో పూర్తి చేసి, ఆన్లైన్ నమోదు వంద శాతం చేయాలి ఆదేశించారు. జిల్లాలోని 62 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణాలు పూర్తి అయ్యాయని, చిన్నచిన్న పనులు, నీటి సరఫరా తదితరాలు ఉంటే వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. మంజూరైన 2,570 రైతు కల్లాల్లో పూర్తికాని చోట్ల పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఉపాధి హామీ కింద జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒకరికీ పని కల్పించాలని, పని దినాల లక్ష్యాన్ని సాధించాలని తెలిపారు. అటవీశాఖ ద్వారా 3 లక్షల టేకు మొక్కలు సమకూర్చుకొని డిమాండ్ మేరకు పంపిణీ చేయాలని సూచించారు.
జిల్లాలోని 281 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లను సమకూర్చుకున్నామని, పారిశుధ్యం పకడ్బందీగా చేపట్టాలన్నారు. పన్నుల వసూలు వంద శాతం పూర్తి చేయాలని పేర్కొన్నారు. జిల్లాలోని 4 సామాజిక, 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా ర్యాపిడ్ పరీక్షలు, జిల్లా ప్రధాన వైద్యశాలలో ఆర్టీపీసీఆర్ టెస్టులను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వైద్యశాలలో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ కేంద్రంలో 57 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిటీ స్కాన్ విషయంలో సత్వరమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 400 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యం కాగా, 86 మంది రైతులు సాగుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఆయిల్ ఫామ్ నర్సరీ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. 9 రిజర్వాయర్లు, 804 చెరువులు, కుంటల్లో చేప పిల్లలు వదిలేందుకు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాదకరంగా ఉన్న భవనాలను ఇంజినీరింగ్ అధికారులతో తనిఖీ చేయించి, వాటి స్థితిపై ధ్రువీకరణ తీసుకోవాలని, ప్రమాదకరంగా ఉన్న చోట విద్యార్థులను వేరే ప్రాంతానికి తరలించి తరగతులు నిర్వహించాన్నారు. పాఠశాలల్లో కరోనా నిబంధనలు తప్పక పాటించాలని, పారిశుధ్య పనులు రోజూ నిర్వహించాలని అన్నారు. జిల్లాలో టూరిజం అభివృద్ధికి చేపట్టిన పనుల్లో వేగం పెంచాలని, మంజూరైన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతి బుధవారం మండల ప్రత్యేక అధికారులు వారి మండలాల్లో పర్యటించి, పనుల పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు. త్వరలో క్షేత్రస్థాయి తనిఖీలు ఉంటాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జవాబుదారితనంతో వ్యవహరించాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, జడ్పీ సీఈవో ఎల్ విజయలక్ష్మి, డీఆర్డీవో జీ రాంరెడ్డి, డీపీవో కే రంగాచారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన ఎంపీడీవోల సంఘం
స్టేషన్ ఘన్పూర్: జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన శివలింగయ్యను గురువారంం ఎంపీడీవోల సం ఘం జిల్లా అధ్యక్షుడు దేశగాని కుమారస్వామి ఆధ్వర్యంలో సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో జడ్పీ సీఈవో విజయలక్ష్మి, ఎంపీడీవోలు జనగామ హిమబిందు, రఘునాథపల్లి హసీమ్, కొడకండ్ల రమేశ్, దేవురుప్పుల ఉమామహేశ్వర్, తరిగొప్పుల ఇంద్రసేనారెడ్డి, నర్మెట ఖాజా మొయినుద్దీన్ ఉన్నారు.