రూ.15 కోట్లతో చిట్టడవుల పెంపకం
రాంపూర్‌లో ఆక్సిజన్ పార్కు..
ఖిలావరంగల్‌లో అర్బన్ లంగ్స్ స్పేస్
‘కుడా’ ఆధ్వర్యంలో పనులు
వరంగల్, జనవరి 1 : కాలుష్యానికి కేరాఫ్‌గా మారుతున్న పట్టణాల్లో స్వచ్ఛమైన గాలిని అందించేందుకు అర్బన్ లంగ్స్ స్పేస్ పేరుతో అన్ని రకాల చెట్లను పెంచుతున్నారు. నగరంలోనే అడవులను పోలిన ప్రాంతాలను సృష్టిస్తున్నారు. ఇప్పటికే అనేక మెట్రోపాలిటన్ నగరాల్లో ఇలాంటి పార్కులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) అధికారులు హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో రెండు పార్కుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ముందు చూపుతోనే అధికారులు రాంపూర్‌లో 40 ఎకరాలు, ఖిలావరంగల్ కోటలోని 30 ఎకరాల స్థలంలో రెండేళ్ల క్రితమే మొక్కలు నాటారు. ఇప్పుడు అవి చెట్లుగా మారాయి. త్వరలోనే ఆయా ప్రాంతాలు పెద్దపెద్ద వృక్షాలతో అడవులను తలపించనున్నాయి. ఆక్సిజన్ పార్కు, అర్బన్ లంగ్స్ స్పేస్ ప్రాంతాలను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు.
ఆక్సిజన్ పార్కులో అనేక వింతలు
ముంబాయి నగర శివారు ప్రాంతంలో మహారాష్ట్ర నేచర్ పార్కు (ఈడెన్ జంగిల్) తరహాలో ఆక్సిజన్ పార్కును రూ. 5 కోట్లతో అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. 40 ఎకరాల్లో దట్టమైన అడవిని తలపించేలా చెట్లను పెంచుతున్నారు. మిగిలిన సగంలో సహజసిద్ధంగా ఉన్న చెరువుతోపాటు ఎన్నో వింతలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ రహదారి పక్కన అభివృద్ధి చేయనున్న ఆక్సిజన్ పార్కు ప్రజలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. నగరానికి ముఖద్వారం ముందు ఉండే ఆక్సిజన్ పార్కులో ఏర్పాటు చేయనున్న ‘ ఫజిల్ పార్కు’ పర్యాటకులను అబుర్బపరుస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. ఫజిల్ పార్కులో అడుగు పెడితే దారి తప్పుతారని, పద్మవ్యూహాన్ని తలపిస్తుందని చెబుతున్నారు. టూరిజం డిజిటల్ గ్యాలరీ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. వరంగల్‌కు వచ్చే పర్యాటకులకు ఆక్సిజన్ పార్కులోని డిజిటల్ గ్యాలరీ గైడ్‌గా ఉపయోగపడనుంది. మొదట ఆక్సిజన్ పార్కుకు వెళ్లి డిజిటల్ గ్యాలరీ చూస్తే చారిత్రక వరంగల్ నగర ప్రత్యేకతలు, వరంగల్ జిల్లాలో చూడాల్సిన ప్రాంతాలు, వాటి విశిష్టతను తెలిపే డాక్యుమెంటరీ ఉంటుందని అధికారులు అంటున్నారు. దీనికితోడు ఆక్సిజన్ పార్కులో చిల్డ్రన్ కెఫెటేరియా, ఫుడ్ కోర్టులు, ఎలక్ట్రికల్ చార్జింగ్ జోన్, ఫిషింగ్ హంట్ జోన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. చేయనున్నారు.
రూ. 10 కోట్లతో కోటలో అర్బన్ లంగ్స్ స్పేస్
చారిత్రక కాకతీయ సామ్రాజ్య కోటలోని 30 ఎకరాల స్థలాన్ని అర్బన్ లంగ్స్ స్పేస్ పేరుతో రూ. 10 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే రెండేళ్లు క్రితం నాటిన మొక్కలు చెట్లుగా పెరిగి చిట్టడవిని తలపిస్తున్నాయి. ఖిలావరంగల్ కోటకు వచ్చే పర్యాటకులతో పాటు నగర ప్రజలకు ఆహ్లాదం కలిగించేలా అర్బన్ లంగ్ స్పేస్‌ను అభివృద్ధి చేసేందుకు కుడా అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. అదేవిధంగా పక్కన ఉన్న గుండు చెరువును శుభ్రం చేసి వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం అర్బన్ లంగ్స్ స్పేస్ ప్రాంతంలో రిసార్టులను నిర్మించనున్నారు. దీంతో పాటు చిన్న చిన్న కాటేజీలు ఏర్పాటు చేయాలని కుడా అధికారులు యోచిస్తున్నారు. ముఖ్యంగా వన భోజనాల కోసం ప్రత్యేక జోన్ నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు. రెస్టారెంట్లు, చిల్ట్రన్స్ ప్లే జోన్, గుండు చెరువులో వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అర్బన్ లంగ్స్ స్పేస్ ఏర్పాటు చేసే ప్రాంతం చుట్టూ ప్రహరీ నిర్మాణం పూర్తి చేశామని అధికారులు తెలిపారు.