జిల్లాలో లక్ష్యానికి చేరువలో కరోనా నియంత్రణ టీకాలు
వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 3,55,916
తీసుకోవాల్సిన వారు 48,569
పీహెచ్‌సీల వారీగా కలెక్టర్ పర్యవేక్షణ
నవంబర్ 3 వరకు నూరు శాతం పూర్తికి చర్యలు
జనగామ చౌరస్తా, అక్టోబర్ 31 : సర్కారు ఆదేశాలకనుగుణంగా వ్యాక్సినేషన్ లక్ష్యానికి చేరువలో ఉంది. జిల్లాలో మొత్తం 16 పీహెచ్‌సీలున్నాయి. 81 ఏళ్లకు పైబడి కరోనా నియంత్రణ టీకాలు తీసుకోవాల్సిన వారు 4,44,85 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో మొదటి డోసును 3,55,916 మంది అక్టోబర్ 30వ తేదీ వరకు తీసుకున్నారు. మిగిలిన 48,569 మం ది టీకాలు తీసుకోవాల్సి ఉంది. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా నోడల్ అధికారులు, మల్టీ డిసిప్లినరీ టీం సభ్యు లు ప్రతి ఇంటికీ, రైతుల వ్యవసాయ క్షేత్రాలు, ఇటుక బట్టీలు, రైస్ మిల్లుల వద్దకు వెళ్తున్నారు. కరోనా నియంత్రణకు టీకాలు ఇస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో మొద టి డోస్ వ్యాక్సినేషన్ 90 శాతం పూర్తికాగా, రెండో డోస్ వ్యాక్సినేషన్ 40 శాతం పూర్తయింది. జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య నేతృత్వంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు వెళ్తూ టీమ్ వర్కుని కొనసాగిస్తున్నారు. నవంబర్ 3వ తేదీని టార్గెట్ రీచ్ డేగా కలెక్టర్ ప్రకటించడంతో వైద్యారోగ్య సిబ్బందితో పాటు ఇతర శాఖల అధికారులు జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి యజ్ఞంలా విధులు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ నిరంతరం కొవిడ్ వ్యాక్సినేషన్‌పై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. వ్యాక్సినేషన్‌పై ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని అవగాహన కల్పిస్తున్నారు. కలెక్టర్ స్వయంగా గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లడం, సడెన్ విజట్ చేస్తుండడంతో అధికారులు, సిబ్బంది నిరంతరం లక్ష్యానికి అనుగుణంగా తమ విధుల్ని నిర్వహిస్తున్నారు. నవంబర్ 3వ తేదీలోపు వంద శాతం సాధించి కరోనా రహిత జిల్లాగా మార్చాలని అధికార యంత్రాంగం కృషి చేస్తున్నది.
జిల్లాలో 18-44 ఏండ్ల వయసు ఉండి మొదటి డోసు టీకా తీసుకున్నవారి సంఖ్య 183234, రెండో డోసు తీసుకున్న వారి సంఖ్య 40717. 45-59 ఏండ్ల వయసు ఉండి మొదటి డోసు టీకా తీసుకున్న వారి సంఖ్య 102780, రెండో డోసు తీసుకున్నవారి సంఖ్య 50135. 60 సంవత్సరాల వయసు పైబడినవారిలో మొదటి డోసు టీకా తీసుకున్నవారి సంఖ్య 64610, రెండో డోసు తీసుకున్నవారి సంఖ్య 45265. హెల్త్‌కేర్ వర్కర్లు మొదటి డోసు తీసుకున్నవారి సంఖ్య 2535, రెండో డోసు తీసుకున్నవారి సంఖ్య 2531, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌లో మొదటి డోసు తీసుకున్నవారి సంఖ్య 2757, రెండో డోసు తీసుకున్నవారి సంఖ్య 2744.