జనగామ, మే 16 (నమస్తే తెలంగాణ) : ఓరుగల్లు పరువు తీసిన కాంగ్రెస్ సర్కారు ఆడబిడ్డలకు క్షమాపణలు చెప్పాలని జనగామ మ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జనగామలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహిళలతో విదేశీ అందగత్తెల కాళ్లు కడిగించి రాణీ రుద్రమదేవి ధీరత్వం.. సమ్మక్క సారలమ్మల వీరోచిత పోరాట స్ఫూర్తిని దెబ్బతీసే లా చేశారని అన్నారు.
ఒకవైపు ప్రభుత్వం దివాలా తీసిందని ప్రకటించిన ముఖ్యమంత్రి కాస్మోటిక్ కంపెనీలకు లాభాలు తెచ్చే ప్రపంచ అందాల పోటీలు నిర్వహించడం దౌర్భాగ్యమని పేర్కొన్నారు. అకాల వర్షాలు, వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయి కన్నీళ్లు పెడుతున్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అందాల పోటీలకు రూ. వందల కోట్లు మంటగలపడం శోచనీయమని అన్నారు. చారిత్రక నగరంగా..ఆలయాలకు నెలవైన వరంగల్‌కు ప్రపంచ సుందరీమణులను తీసుకొ చ్చి ఇక్కడి మహిళల ధైర్యసాహసాల స్ఫూర్తిని చెబుతారని భావిస్తే అత్యంత అవమానకరంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు.
రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రులు రామ ప్ప దేవాలయం, వేయి స్తంభాలగుడి, యాదగిరి గుట్ట వంటి పుణ్యక్షేత్రాలను గౌరవంగా దర్శించారు తప్ప ఎవరూ ఇలాంటి పనులు చేయలేదన్నారు. తెలంగాణ మహిళా మంత్రులు దీన్ని మన సంప్రదాయంగా సమర్థించడం విడ్డూరమన్నారు. మన సంప్రదాయం ఇదేనా? సోకాల్డ్ తెలంగాణ మేధావులు ఎకడికి పోయారు?..మన సంసృతి ఏమైంది అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్రెగుట్టల్లో పిట్టలను కాల్చినట్టు కాలుస్తుంటే దాని గురించి మాట్లాడని వాళ్లు సంప్రదాయమని మాట్లాడుతుండడం దురదృష్టకరమన్నారు.
దేశ చరిత్రలోనే బీఆర్ఎస్ రజతోత్సవ సభ మైలురాయిగా నిలిచిందని.. సభ విజయవంతానికి జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ గులాబీ సైనికులు ప్రధాన భూమిక పోషించారని పేర్కొన్నారు. కేసీఆర్ ఎల్కతుర్తి సభలో మాట్లాడి తిరుగు ప్రయాణంలో దారి పొడవునా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికి అభిమానం చాటారన్నారు. సమావేశంలో కొమురవెల్లి ఆలయ మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్లు పోకల జమున, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్దె సిద్ధి లింగం, మాజీ ఎంపీపీ మేకల కళింగరాజు, పట్టణ పార్టీ అధ్యక్షుడు తాళ్ల సురేశ్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు ముస్త్యాల దయాకర్, పేర్ని స్వరూప, బీఆర్ ఎస్ నాయకులు బండ యాదగిరిరెడ్డి, ఇర్రి రమణారెడ్డి, బొల్లం శారద, ఉల్లెంగుల సందీప్, ఉడు గుల నర్సింహులు, సేవెల్లి మధు, దేవునూరి సతీష్, గుర్రం నాగరాజు, జూకంటి శ్రీశైలం, వై కుమా ర్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లకు పైసలు వసూల్..
ఇందిరమ్మ ఇండ్ల పథకం కాంగ్రెస్ నాయకుల పైసల వసూల్‌కు కేరాఫ్‌గా మారుతున్నది. పల్లెల్లో అయితే రూ. 50 వేలు, పట్టణంలో రూ. లక్ష లంచం తీసుకొని ఎంపిక చేస్తున్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. పైసలు ఇచ్చినోళ్లకో..లేకుంటే కాంగ్రెస్ నేతల బంధుగణానికో పథకం వర్తిస్తున్నది. అసలు ఇల్లు కట్టక ముందే లంచం తీసుకోవడం ఎంతవరకు సబబు. కలెక్టర్ జోక్యం చేసుకొని అర్హులకు ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. లంచం తీసుకొని ఇచ్చారంటే శిక్షకు గురవుతారని అన్నారు. రాజీవ్ యువ వికాసం కూడా పైసలు వసూళ్లు మొదలుపెట్టారని, ప్రభుత్వం వద్ద పైసలు లేవ్ అంటూనే కింద వాళ్లు వసూలు చేసి ఎవరికి ఇస్తారో? ఎవరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారో? చూడాలన్నారు.
కడియం.. ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడు
మాజీ ఎమ్మెల్యే రాజయ్య
కడియం శ్రీహరి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు.. ఒళ్లు దగ్గరపెట్టుకో కేసీఆర్, కేటీఆర్‌ను, పల్లా పేరెత్తితే నాలుక చీరేస్తా..జాగ్రత్త. అక్కడ సీఎం డబ్బుల్లేవ్ అంటుంటే ఇకడ కడియం శ్రీహరి నియోజకవర్గ అభివృద్ధికి రూ.800 కోట్లు తెచ్చానంటూ గొప్పులు చెబుతున్నాడు. ఆయన ఇప్పటి వరకు 8 పైసలు తేలేదు. ఇప్పుడు జరుగుతున్న పనులన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మంజూ రై..ప్రారంభమయ్యాయి. స్టేషన్‌ఘన్‌పూర్ అభివృద్ధిలో కడియం పాత్ర గుండుసున్నా..ఆయనో ఐరెన్‌లెగ్ లీడర్. దేవాదుల విషయంలో ఆయన తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కడియం తలకిందకు..కాళ్లు పైకి పెట్టి నియోజకవర్గం మొత్తం ప్రదక్షిణ చేసినా డిపాజిట్ రాదు.