లింగాలఘనపురం/స్టేషన్‌ఘన్‌పూర్/ధర్మసాగర్/వేలేరు, డిసెంబర్ 9 : కేసీఆర్ ఉత్తర్వులతోనే నవాబుపేట రిజర్వాయర్‌లోకి నీళ్లు విడుదలయ్యాయని, రేవంత్ వల్లే వచ్చాయంటున్న కడియం శ్రీహరి చర్చకు సిద్ధంగా ఉండాలని జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు. జనగామ మండలంలోని నెల్లుట్ల, కుందారం, కిష్టగూడెం, చీటూరు, నేలపోగుల, నవాబుపేట, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం మీదికొండ, ధర్మసాగర్ మండలం ఎలుకుర్తి, దేవునూరు, వేలేరు మండలం మల్లికుదుర్ల, సోడషపల్లి, వేలేరు గ్రామాల్లో మంగళవారం బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల గెలుపు కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కేసీఆర్ ముఖం చూసే కడియంను ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. పొద్దు తిరుగుడు పువ్వు స్వభావం ఉన్న కడియం అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలి పోతాడన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్‌ను మోసం చేశాడన్నారు. కాంగ్రెస్ చేసిన మోసానికి అసెంబ్లీ ఎన్నికలో దగా పడ్డామని, .పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు చర్చించుకొని ఓటు వేయాలన్నారు. రేవంత్ హామీ ఇచ్చిన పథకాలు అమలువుతున్నాయా? అంటూ ప్రజలను ప్రశ్నించారు. పథకాలు అందితే కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులకు, రాని వారు బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులకు ఓటు వేయాలన్నారు.
బీఆర్ఎస్తోనే గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందుతాయన్నారు. మండలంలోని పేదలకు ఆధార్ కార్డు ద్వారా తమ నీలిమ దవాఖానలో ఉచితంగా రూ. 15 లక్షల వరకు వైద్య సేవలందిస్తామన్నారు. సమావేశాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బస్వగాని శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర నాయకుడు సేవెల్లి సంపత్, మాజీ ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ చౌదరపెల్లి శేఖర్, నాయకులు దుంబాల భాస్కర్‌రెడ్డి, ఏదునూరి వీరన్న, ఉడుగుల భాగ్యలక్ష్మి, ఆయా గ్రామాల బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు నల్ల లాజర్, బైరు యాకన్న, భూక్యా నరసింహ, ఎర్ర యాదయ్య, గుగ్గిళ్ల నవీత హరికృష్ణ, బైరి యాకన్న తదితరులు పాల్గొన్నారు.