జనగామ, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : మెజార్టీ ప్రజలు, వర్గాల అభిప్రాయాల మేరకే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) పరిధిలో గ్రామాలను విలీనం చేసే విషయమై నిర్ణయం తీసుకుంటామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. కుడా ప్రతిపాదించిన విలీన గ్రామాలు, వాటి పరిధి వంటి అంశాలపై ఆయన కసరత్తు ప్రారంభించారు.
మంగళవారం క్యాంపు కార్యాలయంలో మున్సిపల్, ‘కుడా’ విలీన గ్రా మాల ప్రజాప్రతినిధులు, పట్టణంలోని వివిధ సంఘాలు, వాణిజ్య సంస్థలు, చాంబర్, వర్తక సంఘాలు, డాక్టర్లు, కళాశాలల యాజమాన్యాలు, న్యాయవాదులు, సీపీఎం, సీపీఐ, బీజేపీ జిల్లా ప్రతినిధి బృందంతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. అర్బన్ అభివృద్ధిలో భాగంగా జనగామ మండలంలోని పలు గ్రామాలను కలుపుతూ కుడా రూపొందించిన రూట్ మ్యాప్‌ను చూపించారు.
అయితే వివిధ వర్గాల నుంచి వ్యక్తమైన భిన్నాభిప్రాయాలను క్రోడీకరించి ఏకాభిప్రాయం సాధించేందుకు వీలుగా మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. కుడా పరిధిలో గ్రామాలను విలీనం చేస్తే జరిగే లాభ, నష్టాలు, పన్నుల పెంపు, నిర్మాణాలకు అనుమతులు వంటి విషయాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు.
అలాగే జనగామ అర్బన్ డెవలప్మెంట్ ఆథారిటీ (జుడా) ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదించాలన్న అభిప్రా యం వ్యక్తం కాగా, జనాభా వంటి నిబంధనల వల్ల అది ఇప్పట్లో సాధ్యం కాదని, తొలుత ‘కుడా’ పరిధిలోకి వెళ్లిన తర్వాత ప్రయత్నం చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
కాగా, జనగామలో శుద్ధమైన మంచినీటిని అందించేందుకు చర్యలు చేపట్టాలని, పట్టణంలోని బ్రిడ్జి మరమ్మతులు చేపట్టాలని, హుస్నాబాద్-జనగామ రోడ్డుపై గానుగపహాడ్ వద్ద బ్రిడ్జి పనులు వేగంగా పూర్తి చేయాలని, వడ్లకొండ, చీటకోడు వాగులపై బ్రిడ్జిలు నిర్మించాలని, నియోజకవర్గంలో పాడి, కోళ్ల పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఇండస్ట్రీ కారిడార్ ఏర్పాటుకు కృషి చేయాలని ప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.
అలాగే జనగామలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు కృషి చేయాలని, చంపక్ హిల్స్ గిరిజన వెల్ఫేర్ హాస్టల్లో గదుల నిర్మాణంతో పాటు సౌకర్యాలు కల్పించాలని, పీజీ కాలేజీకి కేటాయించిన స్థలంలో నిర్మాణ పనులు చేపట్టాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మందులు, డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
స్పందించిన పల్లా అన్ని పక్షాల భాగస్వామ్యంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, సాంబరాజు యాదగిరి, ఇర్రి అహల్య, సీనియర్ నాయకులు బొట్ల శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, జోగు ప్రకాశ్, సుంచు విజేందర్, భూక్యా చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.