BRS | పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడాన్ని పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కాంగ్రెస్ నాయకులపై కేసులు లేవు కానీ.. ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై మాత్రం కేసులు పెట్టి వేధిస్తున్నారని తాండూరు మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి శ్రీశైల్ రెడ్డి, రాజు గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగంపై ఎస్ఈసీ, ఐజీ, కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశామని తెలిపారు.
తాండూరులో రాజ్యాంగ ఉల్లంఘన, ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందని శ్రీశైల్ రెడ్డి, రాజు గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్తే కేసు లేదని.. కానీ కౌంటింగ్ జరుగుతుండగా ఎమ్మెల్యేను లోపలికి ఎలా పంపించారని అడిగితే మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టారని తెలిపారు. ఇది దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కాంగ్రెస్ నాయకుల మీద కేసులు లేవని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులపై కేసు విషయంలో ఎస్ఈసీ జోక్యం చేసుకోవాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులు కొట్టివేయాలని కోరారు.