జనగామ, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : జనగామ కాంగ్రెస్‌లో వర్గ విబేధాలు తారాస్థాయికి చేరాయి..సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేటి నుంచి నియోకవర్గంలో పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర చేపడుతున్న వేళ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి వర్గీయుల గ్రూపుల కొట్లాట ముదిరి పాకాన పడ్డాయి. భట్టి కాలు మోపక ముందే రెండు వర్గాల నాయకులు, కార్యకర్తలు ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, క్రమశిక్షణ ఉల్లంఘనపై ఫైవ్‌మెన్ కమిటీ నివేదిక ఆధారంగా మాజీ ఎమ్మెల్యే కొమ్మూరిని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జనగామ డీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ లింగాజీ గురువారం లేఖ విడుదల చేశారు. ఆ తర్వాత గంటలోనే కొమ్మూరి వర్గీయులైన కొందరు సీనియర్ నాయకులు సమావేశమై పార్టీని భ్రష్ఠుపట్టిస్తున్న పొన్నాలను తామే కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించారు. ఆ తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన కొమ్మూరి వర్గీయులు సీఎం కేసీఆర్‌కు పొన్నాల కోవర్టుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. మతిభ్రమించిన పొన్నాల ఎర్రగడ్డలో చేరి చికిత్స చేయించుకొని రావాలన్న ప్రకటనతో జనగామ కాంగ్రెస్‌లో అగ్గి రాజుకుంది..ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు పరస్పర ఆరోపణలకు దిగడం పార్టీలో రచ్చరచ్చ అవుతుంది. ఏఐసీసీ అధ్యక్షుడి ఎన్నిక ఓటింగ్ వేళ గాంధీభవన్ సాక్షిగా నియోజకవర్గ ముఖ్యనేతలిద్దరి మధ్య విభేధాలు పొడచూపగా ఏకంగా ఎవరికివారే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని ప్రకటనలు చేయడం వైరల్ అవుతున్నది.
‘హస్త’వ్యస్తం..!
జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రెండు ముక్కలాటలా తయారైంది. మొన్నటి వరకు పొన్నాల, జంగా, కోమటిరెడ్డి గ్రూపులు ఉంటే తాజా పరిణామాలతో జంగా, కోమటిరెడ్డి ‘యు టర్న్’ తీసుకున్నారు. తాజాగా పొన్నాల వర్సెస్ కొమ్మూరి వర్గంగా ఢీ అంటే ఢీ అనే స్థాయికి చేరింది. గత సాధారణ ఎన్నికల నాటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు నడుస్తోంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లోనూ టీ-పీసీసీ చీఫ్ హోదాలో ఘోరపరాజయం చెందారు. అనంతర పరిణామాల్లో పార్టీ అధిష్టానం ఆయన్ను టీపీసీసీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో గత సాధారణ ఎన్నికల్లో ఆయనకు జనగామ టికెట్ ఇవ్వొద్దని ఓ వర్గం అధిష్టానం ముందు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించింది. పొత్తులో భాగంగా తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్‌కు టికెట్ ఇవ్వాలనే డిమాండ్లు వ్యక్తమయ్యాయి. మొత్తం మీద బీ ఫారం ఇచ్చే నాటికి సీన్ మారడంతో పొన్నాలకే టికెట్ దక్కింది. అయినా ఆయన ఓటమి పాలయ్యారు.
ఎన్నికల అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా జంగా రాఘవారెడ్డిని అధిష్టానం నియమించింది. దీంతో పొన్నాల పట్టుబట్టి తన వర్గీయుడైన లింగాజీకి డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇప్పించుకున్నారు. అప్పటి వరకు ఒకటిగా ఉన్న పార్టీ కార్యాలయం రెండుగా వేరు కుంపటైంది. జిల్లా కార్యాలయం ఉన్నప్పటికీ పొన్నాల లక్ష్మయ్య వేరే చోట మరో కార్యాలయం ఏర్పాటు చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టీ-పీసీసీ నేతగా ఉన్నన్ని రోజులు పార్టీలో జంగా హవా కొనసాగగా, ఆ తర్వాత రేవంత్‌రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టడంతో రాజకీయ సమీకరణలు మారాయి. ఈ పరిణామాలతో పట్టణ, మండల, నియోజకవర్గ కమిటీల నియామకంలో పొన్నాల సిఫార్సు చేసిన వారికి కీలక పదవులు దక్కాయి. తర్వాత జరిగిన పరిణామాలతో డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవారెడ్డి హనుమకొండ నియోజకవర్గం టికెట్ ఆశిస్తూ కొద్దినెలలుగా జనగామలో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అలప్పటికే పార్టీలో వర్గపోరు కొనసాగుతుండగా ఈ నియామకాల తర్వాత తారాస్థాయికి చేరింది. అధికారికంగా నియామకమైన నియోకవర్గ, బ్లాక్, మండల, గ్రామ, కాంగ్రెస్ కమిటీలకు సమాచారం లేకుండా నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని గతంలోనూ పొన్నాల వర్గీయులు టీ-పీసీసీ క్రమశిక్షణ కమిటీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి పీసీసీ సభ్యుడిగా కొనసాగుతూనే జనగామ డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తూ ఇటీవల నియోజవకర్గంలో పర్యటిస్తునానపర్యటనల్లో జనగామ కాంగ్రెస్ టికెట్ తనదే.. పొన్నాల మద్ధతు నాకేనంటూ బహిరంగంగా ప్రకటించడం వర్గపోరులో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఈ పరిణామాలు పార్టీ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపాయి.
రెండు వర్గాలు.. నాలుగు గ్రూపులు..
రచ్చబండ మొదలు హత్సేహాత్ జోడో యాత్ర సహా పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో పొన్నాల, కొమ్మూరి మధ్య పొడచూపుతున్న విభేదాలు ఇటీవల వడగండ్ల బాధిత రైతులను పరామర్శించే సందర్భంలోనూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ రెండు వర్గాలు.. నాలుగు గ్రూపులుగా విడిపోవడం గమనార్హం. టీ-పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు జంగా అనుచరులు ఎవరికీ వారే అన్నట్లుగా జట్టుకట్టి ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలతో పార్టీ నవ్వులపాలవుతున్నది. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కొమ్మూరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని డీసీసీ కార్యానిర్వాహక అధ్యక్షుడు ప్రకటిస్తే..తెలంగాణ తొలి పీసీసీ అధ్యక్షుడిగా, నాలుగు పర్యాయాలు కేబినెట్ మంత్రిగా పనిచేసిన పొన్నాలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామంటూ కొమ్మూరి అనుచరులు బహిరంగంగా ప్రకటించడం పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. మరికొద్ది గంటల్లో సీఎల్పీ నాయకుడు నియోజకవర్గంలో కాలుమోపుతుండగా కాంగ్రెస్ పార్టీ నిట్టనిలువునా రెండు ముక్కలుగా చీలిపోయినట్లయింది.