జనగామ చౌరస్తా, మార్చి 4 : అలీబాబా అద్భుత దీపం.. అర డజను దొంగలు వంటి కథలను పుస్తకాల్లో చదివాం. సినిమాల్లో మాత్రమే చూశాం. కానీ నిజ జీవితంలో అమాయకులను మోసం చేసేందుకు మంత్రపు పెట్టెకు అద్భుత శక్తులున్నాయని నమ్మించి, మోసం చేసేందుకు యత్నించిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను సోమవారం జనగామ అర్బన్ పీఎస్‌లో ఏసీపీ ఎస్ఆర్ దామోదర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మున్ననూర్‌కు చెందిన కేతావత్ శంకర్ (ప్రస్తుతం హైదరాబాద్), నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సంఘంబండకు చెందిన ఖాసీం, వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన మహ్మద్ అజార్, నల్లగొండ జిల్లా దిండి మండలం దేవత్‌పల్లి తండాకు చెందిన కొర్ర గాసిరాం ముఠాగా ఏర్పడ్డారు.
తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుని అమాయకులను మోసం చేసేందుకు పథకం రూపొందించారు. ఆకాశం నుంచి ఉల్కలు తెగి కిందపడినపుడు వారికి ఓ మంత్రపు పెట్టె దొరికిందని, దానికి అద్భుతమైన శక్తులు ఉన్నాయని అమాయకులను నమ్మించారు. అది ఎవరి దగ్గర ఉంటే వారి జాతకం మారిపోయి వెంటనే కోటీశ్వరులు అవుతారని మభ్యపెట్టేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో వరంగల్‌కు చెందిన ఒకరికి మంత్రపు పెట్టెను రూ.50 కోట్లకు విక్రయించేందుకు ఆటోలో నలుగురు కలిసి మంత్రపు పెట్టెతో బయల్దేదారు.
ఈ క్రమంలో జనగామ మండలం పెంబర్తి వై జంక్షన్ వద్ద సోమవారం పోలీసులకు చిక్కారు. వీరిని పోలీసులు విచారించగా నేరం ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ దామోదర్‌రెడ్డి తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన అర్బన్ సీఐ ఎల్ రఘుతో పాటు ఎస్సై సృజన్, కానిస్టేబుళ్లు రామన్న, కరుణాకర్, అనిల్ కుమార్, సాగర్‌ను వెస్ట్‌జోన్ డీసీపీ పీ సీతారాం, ఏసీపీ దామోదర్‌రెడ్డి అభినందించారు.