తాడ్వాయి, జూలై 17 : మండలంలోని మేడారం జంపన్నవాగు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నది. బుధవారం తెల్లవారు జాము నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా జంపన్నవాగులోకి వరద నీరు చేరడంతో ఎల్బాక వద్ద లోలెవల్ కాజ్వే నీట మునిగి ఎల్బాక, పడిగాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
వాగు వద్ద ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా నార్లాపూర్ గ్రామపంచాయతీ సిబ్బంది హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆటోతో పాటు వాగు దాటేందుకు ప్రయత్నించగా వరద ప్రవాహం ఉధృతంగా ఉండడంతో లోలెవల్ కాజ్వే నుంచి వాగులోకి ఆటో పడిపోయింది. గమనించిన స్థానికులు డ్రైవర్‌తో పాటు ఆటోను బయటకు తీశారు.