– తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్ సెంటర్ల పరిస్థితి
రుద్రంపూర్, ఫిబ్రవరి 19 : పేద, మధ్య తరగతి ప్రజలకు సకాలంలో ఉచితంగా అధునాతన వైద్య నిర్ధారణ సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్ సెంటర్లు ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ డయాగ్నస్టిక్స్ ద్వారా ఖరీదైన అనేక రక్త పరీక్షలు ఉచితంగా అందించబడుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రక్త నమూనాలు (శాంపిల్స్) సేకరించబడుతున్నప్పటికీ, వాటి రిపోర్టులు సకాలంలో అందడం లేదని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఆరోగ్య కేంద్రాల నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల లోపే సేకరించిన నమూనాలను డయాగ్నస్టిక్స్ హబ్‌కు తరలించేవారని తెలుస్తోంది. కానీ ప్రస్తుతం రెండు రోజులకు ఒకసారి మాత్రమే శాంపిల్స్ తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల నమూనాలను ఫ్రిజ్‌లో ఉంచి మరుసటి రోజు పంపిస్తున్నారనే సమాచారం కూడా ఉంది. ఇలా ఆలస్యం జరిగితే పరీక్షల ఖచ్చితత్వంపై ప్రభావం ఉంటుందా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గర్భిణీలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు రిపోర్టుల కోసం రోజులు ఎదురుచూడాల్సి వస్తోందని అంటున్నారు.
కొన్ని రక్తపరీక్షలు “కెమికల్ లేదు” అనే కారణంతో నిలిపివేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే, ఉచిత వైద్య సేవలపై ఆధారపడిన పేద ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. జిల్లా వైద్యశాఖ అధికారులు ఈ అంశంపై దృష్టి సారించి శాంపిల్స్ సకాలంలో హబ్‌కు చేరేలా చర్యలు తీసుకోవడం, రిపోర్టులు నిర్దిష్ట గడువులో అందేలా పర్యవేక్షణ చేయడం, అవసరమైన రసాయనాలు, పరికరాల లభ్యతను నిర్ధారించడం, నెలవారీ సమీక్షా సమావేశాలు నిర్వహించడం వంటి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో చేయించుకుంటున్న ఉచిత రక్త పరీక్షల విషయంలో నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఈ విషయమై నమస్తే తెలంగాణ ల్యాబ్ మేనేజర్ నిజాముద్దీన్ ను వివరణ కోరగా సాఫ్ట్వేర్ సమస్యతో రోగుల మొబైల్ ఫోన్లకు మెసేజ్ రావడం లేదని, దానిని త్వరలోనే పరిష్కరిస్తారన్నారు. 2 వేల రక్త పరీక్ష నమూనాలు ఆగిపోయాయని, ల్యాబ్‌లో ఏసీలు పనిచేయక పోవడం వల్ల మిషన్లు వేడెక్కుతున్నాయని, పరీక్షలు నిర్వహించే పరికరాలు ఐదు సంవత్సరాలు దాటిపోయాయని, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, శాంపిల్ తరలించడంలో ఎవరైనా పొరపాటు చేస్తే చర్యలు తీసుకుంటామని కూడా ఆయన తెలిపారు.