హనుమకొండ చౌరస్తా : ఓసీ ఈడబ్ల్యూఎస్ ( OC Commission ) పటిష్ట అమలుకు జాతీయ, రాష్ట్రస్థాయి చట్టబద్ధతగల కమిషన్ ఏర్పాటుకు కలిసికట్టుగా పోరాడాలని ఓసీ జేఏసీ ( JAC ) నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఓసీ జేఏసీ రాష్ర్ట అధ్యక్షుడు గోపు జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడి సంఘాల నాయకులతో ఏర్పడిన రాష్ట్ర ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఓసీల సింహగర్జన సమరభేరి సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గోపు జయపాల్‌రెడ్డి, జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, బ్రాహ్మణ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై దుష్ర్పచారాన్ని ఆపాలని కోరారు. అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారు రిజర్వేషన్ల లేమి కారణంగా అటు సంక్షేమ పథకాల ఫలాలు, ఇటు రాజకీయ పదవులు పొందలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజకీయ రిజర్వేషన్లు లేని కారణంగా ఓసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో ఓసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదన్నారు. తాము ఏ వర్గాలకు వ్యతిరేకం కాదని, అన్ని వర్గాల ప్రజలకు అన్ని రంగాల్లో సమన్యాయం జరగాలన్నదే ఓసి జేఏసీ ధ్యేయమని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో ఓసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని జయపాల్‌రెడ్డి, రామారావు, గంగు ఉపేంద్రశర్మ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 22 చైర్మన్లు రెడీ : ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
రాష్ట్రంలో 22 చైర్మన్లు రెడీగా ఉన్నాయని, అవసరమైన నిధులు, ఆఫీసు, కార్యవర్గం ఖరారయ్యాయని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ( MLA Rajendar Reddy) వెల్లడించారు. ఈనెల మొత్తం ముఖ్యమంత్రి బిజీగా ఉండడం వల్ల ఫిబ్రవరిలో ప్రకటిస్తారని తెలిపారు. ఓసీ పేద ప్రజల కోసం, హక్కుల కోసం కొట్లాడాలన్నారు. ఎవరినీ రెచ్చగొట్టొవద్దని, మన హక్కుల కోసం మనందరం ఐక్యంగా ముందుండి పోరాడుదామన్నారు.
ఈ సమావేశంలో మాజీ మేయర్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, ఆర్యవైశ్య రాష్ర్ట నాయకుడు గట్టు మహేష్ బాబు, ఓసీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బ శ్రీనివాస్, కోటేశ్వరరావు, కోశాధికారి నడిపెల్లి వెంకటేశ్వరరావు, రవీందర్రావు, రాయపాటి వెంకటేశ్వరరావు, వేణుగోపాల్ , దాసరి కేశవరెడ్డి,రావుల నరసింహారెడ్డి, గొట్టిముక్కుల ప్రభాకర్ రెడ్డి, బోయినపల్లి పాపారావు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దొంతి తిరుపతిరెడ్డి, వేణు, ప్రదీప్ రెడ్డి, జైహింద్‌రెడ్డి పాల్గొన్నారు.