హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 30: బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని జిల్లా సంక్షేమ అధికారి జె.జయంతి అన్నారు. బుధవారం అక్షయ తృతీయ సందర్భంగా బాల్య వివాహాల నిర్మూలన కోసం ప్రసిద్ధ వేయిస్తంభాల దేవాలయంలో షేర్ స్వచ్ఛంద సంస్థ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్‌హెల్ప్‌లైన్ సమన్వయంతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ అధికారి జయంతి పాల్గొని మాట్లాడుతూ ముక్కుపచ్చలారని ఆడపిల్లలకు మూడుముళ్లతో భవిష్యత్ నాశనం చేయవద్దని, చదువు, క్రీడలు, సాంస్కృతిక రంగాలలో వారు రాణించేందుకు కృషి చేయాలన్నారు.
రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షుడు, వేయిస్తంభాల దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ బాల్యవివాహాల నిర్మూలన కోసం అర్చక సమాఖ్యతో పాటు పురోహితులు అనేకవిధాలుగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. షేర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి బి.జ్ఞానేశ్వరి మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలోని అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించామని పురోహితులు, పాస్టర్లు, ఖాజీలు మతపెద్దలతో కలిసి బాల్యవివాహాల నిర్మూలన కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో హనుమకొండ సిడిపీవో ఎం.విశ్వజ, జిల్లా బాలల పరిరక్షణ ఇన్చార్జి అధికారి ఎస్.ప్రవీణ్‌కుమార్, చైల్డ్ హెల్ప్‌లైన్ కౌన్సిలర్ కె.రజిత, షేర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు బి.జమున, ఈ.చామంతి, బి.జగన్ పాల్గొన్నారు.