వరంగల్, టేకుమట్ల, కాటారం, పరకాల, జూలై 15 : వరంగల్ నగరంతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల, కాటారం మండలాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. హనుమకొండలో సాయంత్రం కురిసిన కుండపోత వానకు రోడ్లన్నీ చెరువులు, కుంటలను తలపించాయి. బాలసముద్రం, కాకాజీకాలనీ, బస్టాండ్, కాకతీయ డిగ్రీ కళాశాల, అంబేద్కర్ భవన్, పెట్రోల్ పంప్ తదితర ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరి జనం ఇబ్బందిపడ్డారు. అలాగే నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామ శివారులోని కంఠాత్మకూర్ వాగుపై ఉన్న తాత్కాలిక రోడ్డు ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి తెగింది. దీంతో అంబాల మీదుగా హనుమకొండకు రాకపోకలు నిలిచిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో భారీవర్షం కురవడంతో చలివాగు, మానేరు వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. వరద ఉధృతికి వాగుల్లో పోసిన తాత్కాలిక మట్టి రోడ్లు కొట్టుకుపోయాయి. టేకుమట్ల- రాఘవరెడ్డిపేట, బూర్నపల్లి-కిష్టంపేట, గర్మిళ్లపల్లి-ఓడేడు గ్రామాల మధ్య తాత్కాలికంగా పోసిన మట్టి రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో జమ్మికుంట, హుజూరాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంథిని, గోదావరిఖని, మంచిర్యాల, మందమర్రి తదితర పట్టణాలతో టేకుమట్ల మండలానికి సంబంధాలు తెగిపోయాయి.
కాటారంలో భారీ వర్షం కురిసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారు జాము వరకు ఏకధాటిగా కురవడంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. మండలంలో 101.6 మి.మీ వర్షపాతం నమోదైంది. మండలంలోని శంకరంపల్లి జీపీ పరిధిలోని గొల్లపల్లి అంగన్వాడీ కేంద్రం చుట్టూ నీరుచేరింది. బుడగ జంగాల కాలనీలో రేవెళ్లి సమ్మయ్య, గంధం రమేశ్ ఇండ్లలోకి నీరు చేరగా, టేకు రమేశ్ ఇంటి గోడ కూలిపోయింది. రేగులగూడెం జీపీ పరిధి గోపాల్పూర్ వద్ద వాగు పొంగి పొర్లడంతో పక్కనే ఉన్న పంట పొలాలు నీట మునిగి పోయాయి. జాదరావుపేట శివారులోని బ్రిడ్జి సమీపంలో వరద తాకిడికి రోడ్డు కోతకు గురైంది. గంగారం అలుగువాగు, పోతుల్వాయి బొర్రవాగు, ఒడిపిలవంచ బండల వాగు, మల్లారం అలుగువాగు పొంగి పొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దామెరకుంట, మల్లారం, గంగపురి, గుండ్రాత్పల్లిలో పెద్దవాగు ఉప్పొంగడంతో పత్తి చేనుల్లోకి వర్షపు నీరు చేరడంతో తీవ్ర నష్టం వాటిల్లింది.