వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పీడీఎస్ రైస్ అక్రమ రవాణా ఆగడం లేదు. టన్నుల కొద్దీ బియ్యాన్ని ఒక దగ్గర డంపింగ్ చేసి రాత్రికి రాత్రే సరిహద్దులు దాటిస్తున్నారు. ప్రధానంగా వరంగల్ నగర శివారు ప్రాంతాలు, వర్ధన్నపేట, నర్సంపేట, జనగామ, పరకాల ప్రాంతాల్లో ఎక్కువగా ప్రజాపంపిణీ బియ్యం దందా జరుగుతున్నది. దీనికి కొందరు ఇన్స్పెక్టర్లు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కొందరు రైస్‌మిల్లర్లు ప్రజాపంపిణీ బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా రీసైక్లింగ్ చేస్తూ అక్రమాలకు తెరతీస్తున్నారు.
హసన్పర్తికి చెందిన ఓ వ్యక్తి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాలో ఆరితేరి ప్రత్యేక ముఠా ను ఏర్పాటు చేసుకొని కొందరు ఇన్స్పెక్టర్ల అండతో కోట్ల రూపాయలు సంపాదించినట్లు తెలుస్తున్నది. కిరాయి మనుషులతో ఆటోలు, టాటా మ్యాజిక్ వాహనాల్లో రేషన్ డీలర్లు, కిరాణా షాప్‌లు, లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు తీసుకొని హసన్‌పర్తి, దేవన్నపేట, ఉనికిచర్ల, చింతగట్టు, ఔటర్ రింగ్ చుట్టుపక్కల వెంచర్లు, ఖాళీ ప్లాట్లు, క్రషర్లు ఉన్న ప్రాంతాల్లో టన్నుల కొద్దీ డంపింగ్ చేసి రాత్రికిరాత్రే లారీల్లో పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు తెలుస్తు న్నది. రేగొండ మండలానికి చెందిన ఇద్దరు, ములుగు ఘన్‌పూర్‌కు చెందిన మరొకరు పెద్ద మొత్తంలో రేషన్ డీలర్లు, లబ్ధిదారుల నుంచి కిలోకు రూ.8 చొప్పున కొనుగోలు చేస్తూ బ్లాక్ మార్కెట్లో రూ. 20కి విక్రయిస్తున్నారు. నర్సంపేట, వర్ధన్నపేట ప్రాంతాల్లో కొందరు రైస్‌మిల్లర్లు రేషన్ డీలర్స్ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి తమ మిల్లుల్లో రీసైక్లింగ్ చేసి నాణ్యత బియ్యం పేరుతో వ్యాపారం చేస్తున్నారు.
నగర శివారు ప్రాంతాలకు చెందిన ఐదు పోలీస్ స్టేషన్ అధికారులు, ఓ ఏసీపీకి కొద్ది నెలల నుంచి పెద్ద మొత్తంలో మామూళ్లు అందుతున్నట్లు తెలుస్తున్నది. ఏడాది క్రితం బదిలీ అయిన ఓ పోలీసు ఉన్నతాధికారి నిఘా వర్గాల ద్వారా విచారణ జరిపించి అతడితో సంబంధాలున్న ఇన్స్పెక్టర్లను మందలించినట్లు సమాచారం. ఆయన బదిలీ కావడంతో మళ్లీ దందాకు తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేగొండ మండలం చిన్నకోడపాక, శాయంపేట మండలం కొప్పుల, ములుగు ఘన్‌పూర్‌కు చెందిన వారికి ఆయా ప్రాంతాల పోలీసులతో సంబంధాలున్నట్లు తెలుస్తున్నది. జనగామ ప్రాంతంలో భువనగిరికి చెందిన వ్యక్తి పీడీఎస్ అక్రమ రవాణాలో సిద్ధహస్తుడని తెలిసింది. వీరంతా కోళ్లఫారాలు, రైస్‌మిల్లుల్లో రీసైక్లింగ్ బియ్యం తయారీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఏపీ, హైదరాబాద్‌లోని లిక్కర్ తయారీ కంపెనీలకు బియ్యం రవాణా చేస్తున్నట్లు సమాచారం.
పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొద్ది రోజుల నుంచి నిఘా పెట్టి పక్కా సమాచారంతో పీడీఎస్ బియ్యాన్ని పట్టుకుంటున్నారు. వారం క్రితం వర్ధన్నపేటలోని మహేశ్వరి రైస్‌మిల్లులో రూ. 12.50 లక్షల విలువ చేసే 480 టన్ను లు, జనగామలో ఇంట్లో నిల్వ ఉంచిన రూ. 93 వేల విలువ చేసే 74 బస్తాలు, మడికొండ సమీపంలోని కోళ్లఫారంలో 27 క్వింటాళ్లు, పరకాలలో 10 లక్షల విలువ చేసే 360 క్వింటా ళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కొందరు ఇన్స్పెక్టర్లు టాస్క్‌ఫోర్స్ విభాగంలో పనిచేసే వారితో సమాచారం తెలుసుకొని పట్టుబడకుండా అలర్ట్‌చేసి సేఫ్జోన్లో డంపింగ్ చేసి రాత్రి రాత్రే బయటి ప్రాంతాలకు రవాణా చేయడానికి సహకరిస్తున్నట్లు సమాచారం. దీనికి లోడ్ చొప్పున అధిక మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది.