నిన్నమొన్నటి వరకు అందుబాటులో ఉన్న ఇసుక ధర ఇప్పుడు అమాంతం పెరిగింది. నాణ్యమైన ఇసుక లభ్యమయ్యే క్వారీలను ప్రభుత్వం మూసివేసి రీచ్‌లను తగ్గించడంతో ఆన్లైన్ బుకింగ్‌లు జాప్యమవుతున్నాయి. ఇదే అదునుగా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ ఇష్టారీతిన ధరలు పెంచడంతో వినియోగదారులపై భారం పడుతున్నది. డిసెంబర్ నుంచి జూన్ వరకు నిర్మాణాలకు సీజన్ కాగా ఈ కాలంలోనే అడ్డగోలుగా పెరిగిన ఇసుక ధరతో నిర్మాణదారుల వెన్నులో వణుకు పుడుతున్నది. అంత ధర పెట్టి కొనలేక నిర్మాణాలను అతికష్టంమీద పూర్తిచేయాల్సి వస్తున్నది.
(నమస్తే తెలంగాణ) : నెల క్రితం వరకు సులభంగా అందుబాటు ధరలో లభించిన ఇసుక ఇప్పుడు రెండింతల రేటు పెరిగి వినియోగదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది. నాణ్యమైన ఇసుక లభించే రీచ్‌లను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బంద్ చేసింది. తక్కువ క్వారీలు ఉండడంతో డిమాండ్‌కు సరిపడా ఇసుక అందుబాటులో లేక ఆన్లైన్ బుకింగ్‌లో జాప్యమవుతున్నది. ఇదే అదునుగా వ్యాపారులు ఇసుక కృత్రిమ కొరత సృష్టించి రేటు రెండింతల నుంచి మూడింతలు పెంచి అమ్ముతున్నారు. ఒక్కసారిగా పెరిగిన ఇసుక ధరతో నిర్మాణదారులు గగ్గోలుపెడుతున్నారు. డిసెంబర్లో సన్న ఇసుక టన్ను ధర రూ.1000 నుంచి రూ.1100 ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ.1500కు పెరిగింది. దొడ్డు ఇసుక ధర కూడా ఇలాగే ఉంది. రెండు నెలల క్రితం టన్ను రూ.950 ఉన్న దొడ్డు ఇసుక ఇప్పుడు రూ.1200కు పెరిగింది. నిర్మాణ రంగానికి ప్రస్తుత సీజన్ అనువైనది. డిసెంబర్ నుంచి జూన్ వరకు ఎక్కువ నిర్మాణాలు జరుగుతాయి. ఈ సీజన్లో ఇసుకకు సహజంగానే డిమాండ్ ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని ఇసుక రీచ్‌లను బందుపెట్టింది. డిమాండ్ ఎక్కువ ఉండే ఈ సమయంలోనే రీచ్‌లను బందు పెట్టడంతో సరిపడా ఇసుక సరఫరా కావడం లేదు. ఇండ్లు కట్టుకునే మధ్యతరగతి వర్గాలపై ఇసుక ధరల పెంపుతో మరింత భారం పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇసుక రీచ్‌లు ఎక్కువ ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఆన్లైన్లో డీడీలు తీసిన వారికి ఇసుక సరఫరా అయ్యేది. ఇప్పుడు ఇసుక కోసం డీడీలు తీసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లారీల ఓనర్లు ముందుగా డీడీలు తీసి రీచ్‌ల వద్దకు వాహనాలను పంపుతారు. ఇసుక రీచ్‌లు తగ్గడంతో ఇప్పుడు ఆన్లైన్లో డీడీల లభ్యత తక్కువ ఉంటున్నది. రెండు నెలల క్రితం వరకు రోజూ ఒకటి చొప్పున లారీ లోడ్ తెచ్చుకునే వ్యాపారులకు ఇప్పుడు రెండుమూడు రోజులకుగానీ వంతు రావడంలేదు. దీని వల్ల ఇసుక సరఫరా తక్కువై ధరలు పెరుగుతున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఇసుక క్వారీల నుంచి రవాణా తగ్గిపోయింది. ప్రస్తుతం కాళేశ్వరం క్వారీల నుంచి రోజూ సుమారు 12 వేల టన్నుల ఇసుక రవాణా అవుతోంది. గతంలో రోజూ 30వేల నుంచి 40 వేల టన్నుల రవాణా జరిగేదని లారీ యజమానులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం రోజూ 400 బుకింగ్‌లు వస్తుంటే 350 లారీల ఇసుక వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్, హైదరాబాద్‌కు తరలుతున్నది. గతంలో రోజూ 2వేల లారీలు 30వేల నుంచి 40 వేల టన్నుల ఇసుక రవాణా చేసేవని, ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందని లారీ యజమానులు చెబుతున్నారు. కాళేశ్వరం వద్ద పలుగుల 6, పలుగుల (గుండ్రాత్‌పల్లి), పలుగుల 5, పుస్కుపల్లి (బెగ్లూర్ 1), పలుగుల 10, పలుగుల 8, పుస్కుపల్లి (కొల్లూరు 1), పలుగుల 7 (మద్దులపల్లి) క్వారీలు నడుస్తున్నాయి.
మేడారం జాతర నేపథ్యంలో ఏటూరునాగారం వైపు ఇసుక క్వారీలను తాత్కాలికంగా మూసివేశారు. ప్రస్తుతం కాళేశ్వరం వద్ద గల 8 క్వారీల నుంచే ఇసుక రవాణా అవుతోంది. కాళేశ్వరం ఇసుక సాధారణ రకం టన్నుకు రూ.900 ఉండేదని ఇప్పుడు రూ.1200 నుంచి రూ.1400 వరకు పెరిగిందని, నాణ్యమైన ఇసుక రూ.1000 ఉంటే, ఇప్పుడు రూ.1500 నుంచి రూ.1800 వరకు పెరిగిందని వినియోగదారులు చెబుతున్నారు. కొందరు డంప్ చేస్తూ డిమాండ్‌ను బట్టి అధిక ధరకు విక్రయిస్తున్నారు.
ములుగు జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతమైన మంగపేట, వాజేడు, వెంకటాపురం(నూగూరు) మండలాల పరిధిలో 11 క్వారీలు ఉండగా ఆరు క్వారీలు మూతపడ్డాయి. మంగపేట మండలం మల్లూరు, చుంచుపల్లిలో మూడు, వాజేడు మండలం అయ్యవారిపేట, ధర్మవరం, రాంపూర్‌లో మూడు, వెంకటాపురం(నూగూరు) మండలం మొర్రివానిగూడెం, శ్రీరంగపురం, కె. కొండపురం, వంటి చింతగూడెం గ్రామాల్లో నాలుగు క్వారీలుండగా ప్రస్తుతం వెంకటాపురం(నూగూరు) మండలంలోని రెండు క్వారీలు, వాజేడు మండలంలో మూడు క్వారీలు కొనసాగుతున్నాయి. కొందరు ఇసుకను డంప్ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తూ ట్రాక్టర్ ఇసుకను రూ.4వేల నుంచి రూ.7వేల వరకు విక్రయిస్తున్నారు. క్వారీల సంఖ్య తగ్గడంతో ఆన్లైన్లో డీడీలు కూడా రావడం లేదని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాళేశ్వరం ఏరియాలోని పలుగుల (విలాసాగర్ 3) క్వారీని ఎందుకు కొనసాగించడం లేదని లారీ యజమానులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ నాణ్యమైన ఇసుక ఉందని, కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై ఈ క్వారీని కావాలనే మూసేశారని ఆరోపిస్తున్నారు. ఓ అధికారి కాళేశ్వరం ఏరియాలోని క్వారీలపై ఆధిపత్యం చెలాయిస్తూ ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నాడని, ఆయన కనుసన్నల్లోనే అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతోందని లారీ యజమానులు బహిరంగంగానే చెబుతున్నారు. క్వారీల్లోకి బుకింగ్‌తో వచ్చిన ప్రతి లారీ నుంచి రూ.1000 చొప్పున ముక్కు పిండి వసూలు చేస్తున్నారని, ఇలా రోజుకు సుమారు 350 లారీలు రవాణా అవుతుంటే మొత్తం రూ.3.5లక్షలు వసూలు చేస్తున్నారని అంటున్నారు. అక్రమ దందాలో ఆ అధికారిదే ప్రధాన భూమిక అని ఆరోపిస్తున్నారు. అతనిపై హైదరాబాద్‌లోని ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు.
కొన్ని క్వారీలు మూతపడడంతో ములుగు, పస్రా, గోవిందరావుపేట, మల్లంపల్లిలో వ్యాపారులు ఇసుకను డంప్ చేసుకొని కృత్రిమ కొరత స్పష్టిస్తూ అధిక ధరలకు విక్రయిస్తుండడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో వినియోగదారులే స్వయంగా ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకొని ప్రభుత్వం నిర్దేశించిన రుసుం చెల్లించి కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం ఆ అవకాశం లేక వ్యాపారుల వద్ద అధిక ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.