ఖిలావరంగల్, మే 19: అమృత్ భారత్ స్టేషన్ పథకం (ఏబీఎస్ఎస్)లో భాగంగా రూ.25.41 కోట్లతో చేపట్టిన పునర్నిర్మాణ పనులు పూర్తికావచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే ఏసీఎం ఐఎస్ఆర్ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏబీఎస్ఎస్ పథకంలో భాగంగా వరంగల్ రైల్వేస్టేషన్ రూపు రేఖలు పూర్తిగా మారాయన్నారు. రైల్వేస్టేషన్‌ను ఒక వైపు కాకతీయుల చారిత్రక నేపథ్యం ఉట్టి పడే విధంగా, మరోవైపు మోడ్రన్‌గా నిర్మాణం పనులు పూర్తయినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న మూడు ఎస్కలేటర్లకు తోడుగా నాలుగు అదనంగా ఏర్పాటు చేశామన్నారు.
అలాగే కొత్తగా 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి, లిప్టులు, ఎస్కలేటర్లు, ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషన్లు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ప్రయాణికులు సులువుగా స్టేషన్లోకి, బయటకు వెళ్లేందుకు విశాలమైన ద్వారాలను ఏర్పాటు చేశామన్నారు. రైల్వేస్టేషన్‌లోని నాలుగు ప్లాట్పాంతోపాటు 9000 ఎస్ఎఫ్టీ క్వాలిటీ గ్రానైట్‌ను పరిచినట్లు చెప్పారు. అలాగే అంధులు కూడా ఎవరి సహాయం లేకుండా రైల్వేస్టేషన్‌లోకి సులువు వచ్చి రైలు ప్రయాణించే విధంగా ప్రత్యేక ర్యాంపులను ప్రతి ప్లాట్‌పాంపై ఏర్పాటు చేశామన్నారు. పేయిడ్ వేయింట్ హాల్స్, సాధారణ ప్రయాణికుల విశ్రాంతి గదులు, బేబీ ఫీడింగ్ గదులను ఆధునీకరించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు.
అలాగే రైల్వేస్టేషన్ ప్రధాన ద్వారం వైపు చారిత్రక నగరాన్ని ప్రతిబింబించే విధంగా ఏనుగుల విగ్రహాలు, కీర్తితోరణం ఎదురుగా ప్రయాణికులకు కనిపించే విధంగా పురాతన రైలును ఏర్పాటు చేశామన్నారు. అన్ని హంగులతో పూర్తి అయిన రైల్వేస్టేషన్‌ను ఈ నెల 22న భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభిస్తారన్నారు. ఈ సమావేశంలో సీసీఐ రాజగోపాల్, ఎస్ఎంఆర్ సారయ్య, ఆర్పీఎఫ్ సీఐ శ్రీనివాస్‌గౌడ్, ఐవోడబ్ల్యూ, సీటీఐ తదితరులు పాల్గొన్నారు.