వరంగల్, జూలై 22 : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూంసీ) పరిధిలో ల్యాండ్ రైగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)పై బల్దియా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మే 1న రెండోసారి 25 శాతం ఫీజు రాయితీ కల్పించే జీవో జారీ చేసింది. దీని గడువు ఈ నెల 31తో ముగుస్తుందని అందులో పేర్కొంది. అయితే ఈ అంశాన్ని పూర్తిగా విస్మరించిన బల్దియా అధికారులు ఎలాంటి ప్రచారం చేయలేదు. దీంతో అనేక మంది రాయితీ అవకాశాన్ని కోల్పోయారు.
అధికారుల తీరుతో ఈ ప్రక్రియ అస్తవ్యస్థంగా మారగా, ఫీజులు చెల్లించిన వేల మంది దరఖాస్తుదారులకు ఇప్పటికీ ప్రొసీడింగ్ కాపీలు అందలేదు. ప్రతిరోజు వందల మంది బల్దియా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సాంకేతిక లోపంతో వందల దరఖాస్తులు ఆన్లైన్లో కనిపించకపోవడంతో ఫీజు రూపంలో రూ. లక్షలు చెల్లించిన దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. ఎల్ఆర్ఎస్తో రూ. వందల కోట్లు సమకూర్చుకున్న ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై వారు మండిపడుతున్నారు.
వారంలో ముగియనున్న గడువు
వారం రోజుల్లో ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు ముగియనుం ది. గతంలో ఈ అవకాశం కోల్పోయిన వారంతా మళ్లీ రాయితీ పొందే వెసులుబాటు ఉన్నా అధికారులు ఎలాంటి ప్రచారం చేయకపోవడంతో చాలామంది నష్టపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రూ. వేయితో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తులు చేసుకున్న వారు రాయితీని వినియోగించుకునేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉన్నా అధికారులు పట్టించుకోలేదు.
ప్రదక్షిణలు చేస్తున్న పాతవారు..
ఎల్ఆర్ఎస్ పూర్తి ఫీజులు చెల్లించిన వేలాది మందికి ఇంకా ప్రొసీడింగ్ కాపీలు రాకపోవడంతో బల్దియా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గతంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఎత్తివేయడంతో వారికి సమాధానం చెప్పేవారు కరువయ్యారు. ఎల్ఆర్ఎస్ కోసం మొత్తం 1,00,992 దరఖాస్తులు రాగా, అందులో 8,169 ప్రొహిబిటెడ్ కావడంతో వాటితో పాటు మరో వేయి తిరస్కరించారు. మిగిలిన వాటిలో సుమారు 40 వేల మంది వరకు ఫీజులు చెల్లించారు.
అయితే వీరి రఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలన పేరిట నెలల తరబడి ఎల్-1, ఎల్-2 స్టేజీలోనే పెండింగ్‌లో ఉంచారు. ఇప్పటి వరకు 15 వేల మందికి మాత్రం ప్రొసీడింగ్‌లు అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 25 వేల మందికి సంబంధించిన దరఖాస్తులు పరిశీలించి ప్రొసీడింగ్స్ ఇవ్వడమో లేదా తిరస్కరించడమో చేయాల్సి ఉంది. కాగా, ఆన్లైన్లో సాంకేతిక సమస్యతో దరఖాస్తుదారులు కనిపించకుండా పోయినా దానిని సరిచేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పలువురు ఆరోపిస్తున్నారు.