జనగామ, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : ‘జనగామ జిల్లా రైతాంగానికి మళ్లీ సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో అరిగోస పడిన కరువు కాలం మళ్లీ కండ్ల ముందు కదలాడుతున్నది’. అంతటా వానకాలం సాగుకు సరిపడా వానలు పడితే జిల్లాలో మాత్రం వేసవిని తలపించేలా ఎండలు కొడుతున్నాయి. అటు వర్షాభావం.. ఇటు ఎల్‌నినో ప్రభావంతో రైతుల సాగు ఆశలు సన్నగిల్లాయి. వాయుగుండం కారణంగా అంతటా భారీ వర్షాలు కురిస్తే జనగామ ప్రాంతంలో మాత్రం చిరుజల్లులు మినహా భారీ వర్షం పడలేదు.
వరుసగా మూడు రోజులు అడపాదడపా పడిన చినుకులు ఆరుతడి పంటలకు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించినా.. సీజన్‌కు సరిపడా వానలు పడలేదు. స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, చిల్పూరు మినహా మిగతా మండలాల్లో జూన్, జూలై మూడో వారం వరకు సాధారణం కంటే తక్కువగా 40శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, ఆగస్టు మొదటి వరకు వర్షం లోటు 29శాతంగా ఉంది. జూన్‌లో సాధారణంగా 124.2 మి.మీ వర్షం పడాల్సి ఉండగా, కేవలం 88.5 మి.మీ మాత్రమే కురిసింది.
జూలై ఆఖరి వారం నుంచి ఇప్పటివరకు జిల్లాలో భారీ వర్షం నమోదు కాకపోగా ఎండలు మండిపోతుండడంతో పత్తి మొక్కలు వాడిపోతున్నాయి. జిల్లాలో భూగర్భ జలాలు సగటున 9 నుంచి 10 మీటర్ల లోతులో ఉండడంతో బోర్లు, బావుల్లో నీరు అడుగంటుతున్నది. చెరువులు, కుంటలు కలిపి 955 ఉండగా వాటిలో దాదాపు 800 చెరువుల్లో చుక్క నీరులేక ఎండిపోయాయి. ప్రస్తుత సీజన్లో 3.60లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కావాల్సి ఉన్నది. అందులో ప్రధానంగా 2.10 లక్షల ఎకరాల్లో సాగు చేయాల్సిన వరి లక్ష ఎకరాలు కూడా దాటలేదు. వేలాది మంది రైతులు నార్లు పోసి వాన కోసం ఎదురు చూస్తున్నారు. 25 నుంచి 30 రోజుల్లో వేయాల్సిన నాట్లు నీరు లేక సగం కూడా పడని దుస్థితి నెలకొన్నది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరువుకు చిరునామాగా, డార్క్ ఏరియాగా ముద్రపడి అతి దుర్భిక్షాన్ని ఎదుర్కొన్న జనగామ ప్రాంతం. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ సర్కారు హయాంలో దేవాదుల ద్వారా అందిన సాగునీటితో రికార్డు స్థాయిలో పంటలు పండించి పచ్చని కోనసీమ అయ్యింది. జనగామ జిల్లాలో 6 రిజర్వాయర్లు, 3 మేజర్ ఇరిగేషన్ చెరువులు ఉండగా, నర్మెట మండలం గండిరామారం రిజర్వాయర్‌లో (42.47 మీటర్లు) 88.50శాతం, కన్నెబోయినగూడెం చెరువులో (498.75మీటర్లు) 80.41శాతం, బొమ్మకూరు రిజర్వాయర్‌లో (473.40మీటర్లు) 45.63శాతం, లింగాలఘనపురం మండలం నవాబుపేట రిజర్వాయర్‌లో (323.50మీటర్లు) 22.76శాతం, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఆర్ఎస్ ఘన్పూర్ రిజర్వాయర్‌లో (335.70 మీటర్లు) 48.34శాతం, జనగామ పట్టణానికి తాగునీరందించే చీటకోడూరు రిజర్వాయర్‌లో (386.80మీటర్లు) 54.59శాతం, రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి జలాశయంలో (396.73మీటర్లు) 30.54శాతం, వెల్దండ రిజర్వాయర్‌లో (478.50మీటర్లు) 75.30శాతం, నష్కల్ (ఉప్పుగల్) రిజర్వాయర్‌లో (295.20మీటర్లు) 55.29శాతం నీటి మట్టం ఉంది.
వర్షపాతం తక్కువగా ఉండే జనగామ ప్రాంతంలో తెలంగాణ వచ్చిన తర్వాత దేవాదుల ప్రాజెక్టు నుంచి ఆయా రిజర్వాయర్లకు గోదావరి నీటిని పంపింగ్ చేసి కాల్వల ద్వారా చెరువులు, కుంటలు, ఇతర చిన్ననీటి వనరులను నింపడంతో ఎండాకాలంలోనూ భూగర్భజలాలు సమృద్ధిగా ఉండి పంటలకు పుష్కలంగా సాగు నీళ్లు అందేవి. కానీ, సీజన్‌కు ముందే సకాలంలో రిజర్వాయర్లను నింపి వాటి ద్వారా చెరువులు, కుంటలకు నీటిని విడుదల చేయడంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. దీంతో కేవలం రెండు నెలల వ్యవధిలోనే జిల్లాలో నీటి మట్టాలు దారుణంగా పడిపోయి మళ్లీ కరువుకాలం ముంచుకొస్తుండడం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. దేవాదుల ద్వారా రిజర్వాయర్లు నింపి అక్కడి నుంచి గ్రామాల్లో చెరువులు, కుంటలకు నీటిని తరలిస్తే తప్ప వానకాలం సీజన్ గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు.
జిల్లాలోని దేవాదుల రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లోకి అదనులో నీరు చేరకపోవడంతో భూగర్భ జలాలు దారుణంగా పడిపోతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎర్రటి ఎండల్లోనూ మత్తడి దుంకిన చెరువులు, కుంటల్లో ఇప్పుడు నీటి జాడలు కనిపించడంలేదు. బోర్లు వేస్తే 80 ఫీట్ల లోతులోనే ఉబికి వచ్చే గంగమ్మ ఇప్పుడు ఏకంగా 9 నుంచి 10 మీటర్ల లోతుకు పడిపోయింది. వ్యవసాయ బోర్లు, బావులు వట్టిపోయి, వాటి ఆధారంగా వేసిన పంటలు వాడిపోతున్నాయి. ఆగస్టు చివరి నాటికి భూగర్భ జలమట్టం ప్రమాదకర స్థాయిలో సగటున 17-19 మీటర్ల లోతుల్లోకి చేరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలోని జనగామ, తరిగొప్పుల, లింగాలఘనపురం, రఘునాథపల్లి, కొడకండ్ల, బచ్చన్నపేట మండలాల్లో భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతూ కరువు ఘంటికలు మోగిస్తున్నాయి.