ముందస్తుగా మురిపించిన వాన అన్నదాతను నిండా ముంచింది. కాలం కలిసివచ్చిందని సంబురపడ్డ రైతులను నిరాశలోకి నెట్టింది. తొలకరి సమయంలో కురిసిన వర్షాలకు తొందరపడినందుకు కన్నీరు పెట్టిస్తున్నది. వానలు పడక.. చెరువులు, బావులు, బోర్లలో నీళ్లు లేక పోసిన నారు, మొలకెత్తిన పత్తి కళ్లముందే ఎండిపోతున్నది. వీటిని కాపాడుకునే క్రమంలో రైతులు ట్యాంకర్లు, బిందెలతో నీరందించే పరిస్థితి నెలకొంది. వరుణుడు కరుణించక.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక.. కాల్వల ద్వారా నీరందక సాగు చేయాల్సిన భూమంతా నెర్రెలుబారి నోరు తెరుస్తున్నది. రాష్ట్రంలో వర్షం పడకున్నా.. గోదావరి మాత్రం వరదతో పోటెత్తుతున్నది.
ఈ జలాలను ఎత్తిపోసే అవకాశమున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రవాహమంతా సముద్రంలో కలుస్తున్నది. ఉమ్మడి జిల్లాకు ప్రధానమైన కాకతీయ, దేవాదుల కాల్వలు గత బీఆర్ఎస్ హయాంలో ఈ సమయానికి నిండుగా ఉరకలెత్తగా.. నేడు నీళ్లు లేక భోరుమంటున్నాయి. ఫలితంగా ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన రైతన్నపై మరింత ఆర్థిక భారం పడుతున్నది. ముందుగా పోసిన నారుమడులు ఎండిపోగా.. వేసిన పత్తి పంట మొలక దశలోనే మాడిపోతూ రైతులపై మరింత భారాన్ని మోపుతున్నది. ఇక వర్షాలు, కాల్వలపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత పదేండ్లలో వర్షంతో పనిలేకుండా సంబురంగా వ్యవసాయం చేసుకున్న అన్నదాత.. కాంగ్రెస్ సర్కారు తీరుతో ఇప్పుడు మొగులువైపు దీనంగా చూడాల్సిన దుస్థితి నెలకొంది.
– స్టేషన్ ఘన్పూర్, జూలై 15
కాలం కలిసిరాక.. చిన్నబోతున్న చెరువులు
ములుగు, జూలై 15 (నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లాలో ప్రస్తుత వానకాలం కలిసిరావడం లేదు. జూన్ మొదటి వారంలో రుతుపవనాలు ప్రవేశించి జూలై కల్లా విస్తారంగా వర్షాలు కురవాల్సి ఉంది. మరో 15రోజుల్లో ఆగస్టు వస్తున్నప్పటికి జిల్లా వ్యాప్తంగా ఇంకా భారీగా వర్షాలు పడలేదు. ఏటా కాలం వెనుకబడి పోతుండడంతో జిల్లాలోని చెరువులు, కుంటలు చిన్నబోతున్నాయి. ఇందుకు ఉదాహరణగా ములుగు జిల్లా కేంద్రంలోని లోకం చెరువు నిలుస్తున్నది. 2023లో జూలై 25న, 2024లో ఆగస్టు 7న మత్తడి పడింది. ప్రస్తుతం జిల్లాలో చిన్నపాటి వర్షాలే కురవడంతో చెరువు పావువంతు కూడా నిండలేదు. గతంలోని నీరే ఉండగా.. చెరువంతా మైదానాన్ని తలపిస్తున్నది. దీంతో లోకం చెరువు ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మిగిలిన చెరువుల పరిస్థితి సైతం ఇలాగే ఉంది.
9 వేల ఎకరాల్లోనే నాట్లు..
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో ఇప్పటి వరకు సుమారు 15 వేల ఎకరాల్లో నాట్లు పడాల్సి ఉంది. సాగునీటి సమస్యతో కేవలం 9 వేల ఎకరాల్లోనే రైతులు నాట్లు వేసినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. వర్షాలు పడకపోవడంతో మండలంలోని అన్ని గ్రామాల్లో ఇప్పటికే పోసిన వరి నార్లు ఎండిపోతున్నాయి. దీంతో ఒక్కో రైతుకు సుమారు రూ. 6 వేల నుంచి రూ. 12 వేల వరకు నష్టం వాటిల్లింది. కాగా, స్టేషన్‌ఘన్‌పూర్ రిజర్వాయర్ సామర్థ్యం 1.5 టీఎంసీలుండగా, ప్రస్తుతం అందులో 0.6 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అయితే మరో పది రోజుల్లోగా రైతులకు కెనాల్ ద్వారా సాగునీరందిస్తామని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
చుక్క నీరు లేని చెక్‌డ్యాంలు
దేవరుప్పుల : దేవరుప్పుల వాగుపై చెక్‌డ్యాం లు, మండలంలోని చెరువులు, కుంటల్లో నీళ్లు లేక వేసిన వరి నార్లు ఎండిపోయాయి. అడపాదడపా కురిసిన జల్లులతో దున్నిన దుక్కులు సైతం నెర్రెలు బారాయి. ముఖ్యంగా మండలంలోని యశ్వంతాపురం వాగు పై ఉన్న చెక్‌డ్యాంలన్నీ ఎండి చెట్లు మొలవడంతో దాని పరీవాహక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వానలు పడక దేవాదుల నీరన్నా వదులుతారేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్ప టి మంత్రి ఎర్రబెల్లి దేవాదుల నీటితో చెక్‌డ్యాంలు, చెరువులు నింపడంతో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకునేవారు. ఆ ప్రయత్నం నేడు జరగకపోవడంతో రైతులు ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి నష్టపోయే పరిస్థితి నెలకొంది. మరో 15 రోజులు ఇలాగే ఉంటే వేసిన వరి, పత్తి, మెట్టపంటలు ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
నీళ్లు లేక నారు మడి పారిస్తున్న
దేవరుప్పుల: రెండు వేర్వేరు చోట్ల నాలుగెకరాల భూముం టే నీళ్లు లేకపోవడంతో నారుమడి వరకు పారిస్తున్న. నారు ఏతకు వచ్చింది. దుక్కులు దున్నుదామంటే వర్షాలు పడ్తలేవు. గతంల వానలు లేకపోయినా చెక్‌డ్యాంలకు నీళ్లు వచ్చేవి. కడవెండి చెక్‌డ్యాంలో నీళ్లుంటే బోర్లు ఫుల్ పోసేటివి. దేవాదుల కాల్వలు వదిలితే నీళ్లు పుష్కలమయ్యేటివి. ఈ ప్రయత్నం ఎవరూ చేస్తలేరు. ఒక దగ్గర పక్క రైతు నీళ్లతోని నారుమడి తడుపుతున్న. వానలు కురుస్తయన్న ఆశతోని మొగులుకేసి చూస్తున్న.
– బండి కొండయ్య, రైతు, కడవెండి
నారు పోసి నెల దాటింది..
దేవరుప్పుల : కడవెండి మాలవాగుల పొంటి నాకు రెండెకరాల భూమి ఉంది. రెండు బోర్లుంటే ఒకటి ఎండిపోయింది. ఒకటి ఆగిపోస్తాంది. మాలవాగులకు నీళ్లొస్తే నా రెండు బోర్లు పుష్కలంగా పోస్తయ్. నారుపోసి నెల రోజులు దాటిపోయింది. దుక్కులు దున్నడానికి నీళ్లు లేవు. వారం రోజుల్లో వానలు పడకపోతే ఆశ వదులుకునుడే. ఇట్లనే కాలం పోతే శాన మంది రైతులు పెట్టిన నాట్లు ఎండిపోతయ్. దేవాదుల నీరు వదిలితే బాగుండు.
– దండెంపల్లి పెద అంజయ్య, రైతు, కడవెండి
పెట్టుబడి నష్టపోయా..
స్టేషన్‌ఘన్‌పూర్ : తొమ్మిది ఎకరాల్లో వరి సాగు చేసేందుకు నారు పోయగా నీళ్లు లేక ఎండిపోయింది. విత్తన బ్యాగులు, పిండి బస్తాలు, ఇతర ఖర్చులు మొత్తం రూ. 15 వేల వరకు నష్టం జరిగింది. ముందస్తుగా వానలు పడితే సంతోషపడ్డం. ఆ తర్వాత వర్షాలు పడక.. దేవాదుల కాల్వల ద్వారా చెరువులు, కుంటలు నింపకపోవడంతో నారుమడులు ఎండిపోయాయి. ప్రభుత్వ ఇప్పటికైనా స్పందించి కెనాల్ ద్వారా నీరు విడుదల చేసి మమ్ములను ఆదుకోవాలె.
– భూక్యా రవీందర్ నాయక్, మాన్సింగ్ తండా, స్టేషన్‌ఘన్‌పూర్
పదేండ్లలో ఇంత గోస పడలే..
స్టేషన్‌ఘన్‌పూర్ : నేను ఆరెకరాల్లో నారు పోస్తే మొత్తం ఎండిపోయింది. సుమారు రూ. 9 వేల నష్టం వచ్చింది. వానలు, దేవాదుల కాల్వను నమ్ముకునే ఎవు సం చేసుకుంటున్న. ఇది తప్ప మరో పని రాదు. మ బ్బులు మురిపించినా వానలు పడ్తలేవు. ఇట్లయితే మేం ఎవుసం ఎట్ల చేయాల్నో.. ఎట్ల బతకాల్నో అర్థమైతలేదు. గత పదేండ్లలో ఎప్పుడూ ఇంత గోస పడలేదు.
– మరిపల్లి యాకయ్య, విశ్వనాథపురం, స్టేషన్‌ఘన్‌పూర్
పంటలు ఎండినంక నీళ్లిస్తరా?
స్టేషన్‌ఘన్‌పూర్ : నీళ్లు లేక పత్తి మొక్కలు ఎండుతున్నయ్.. వాటిని ఎలా కాపాడుకోవాలో అర్ధం కావడంలేదు. ఇప్పటికే మోకాళ్ల పైకి చెట్టు పెరగాలె. కానీ ఫీటు కూడా పెరగలేదు. ఇట్లయితే దిగుబడి ఎట్లా వస్తది. రైతులకు సాగునీరందించి ఆదుకోవాలని కాంగ్రెసోళ్లకు లేదు. అదును పోయినంక, పంటలు పూర్తిగా ఎండినంక సాగునీళ్లిస్తరా? సమయానికి ఇవ్వకపోతే ఏం లాభం.
– పోలే బాబు, విశ్వనాథపురం, స్టేషన్‌ఘన్‌పూర్