వరంగల్ చౌరస్తా, ఆగష్టు13 : మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రి ఔట్ సోర్సింగ్ సంస్థ తీరు వివాదాస్పదమవుతున్నది. అవసరమైన చోట వదిలేసి కొద్ది నెలలుగా పని చేయని, చేసే స్థితిలోలేని యంత్రానికి టెక్నీషియన్‌ను నియమించడం చర్చనీయాంశమైంది. కలెక్టర్ అనుమతులు, నోటిఫికేషన్ లేకుండా, ఉపాధి కల్పన అధికారి ద్వారా ఎంపికలు జరపకుండానే ఈ నియామకం చేపట్టారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో సదరు కాంట్రాక్టర్ రూ. లక్షల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తోటి సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. ఓ మంత్రి ప్రధాన అనుచరుడి వర్గానికి చెందిన ఔట్సోర్సింగ్ సంస్థ యజమాని నిబంధనలను పక్కన పెట్టి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో అంకాలజీ విభాగంలో విధులు నిర్వర్తించిన ఓ ఉద్యోగి విరమణ అనంతరం కలెక్టర్ అనుమతితో తాత్కాలిక పద్ధతిలో కొనసాగించగా రేడియా థెరపీ సేవలందిస్తూ వచ్చారు. కొంత కాలంగా ఈ యంత్రం పనిచేయకపోవడంతో అతడిని తొలగించారు. ఇప్పుడు ఓ విభాగాధిపతి సదరు ఖాళీ పోస్టులో తన ముఖ్య అనుచరుడిని ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే విధుల్లోకి తీసుకున్నారు. ఇందుకు ఎంజీఎం ఆస్పత్రి పెద్దలు కొందరు తమవంతు సహకారాన్ని అందించినట్లు సమాచారం. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే పోస్టును భర్తీ చేయడంతో ఎన్నో నెలలుగా నియామకాల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులు కొందరు ఎంజీఎంహెచ్ సూపరింటెండెంట్, ఆర్ఎంవో స్థాయి అధికారుల వద్దకు క్యూ కట్టడంతో ప్రస్తుతం ఎలాంటి నియామకాలు లేవని, నిబంధనల ప్రకారం జరుగుతాయని ప్రకటన సైతం విడుదల చేయడం గమనార్హం.
అవసరమైన పోస్టుల ఊసేలేదు.
ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ముగిసిందని ఆరోగ్య శ్రీ ద్వారా రేడియాలజీ విభాగంలో పనిచేస్తున్న 8 మందితో పాటు నలుగురు డాటా ఎంట్రీ ఆపరేటర్లను విధుల నుంచి తొలగించారు. సిబ్బంది కుదింపుతో రేడియాలజీ విభాగంలో ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అయితే తొలగించిన ఆరోగ్యశ్రీ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డీఎంఈ ఉత్తర్వులు జారీ చేసి, నిధులు మంజూ రు చేసినప్పటికీ వారిని నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. ప్రస్తుతం పని చేయని యంత్రానికి టెక్నీషియన్ని మాత్రం నియమించారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి అక్రమ నియామకాలను రద్దు చేసి, అవసరమైన చోట నియామకాలు చేపట్టి వైద్య సేవలను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.