మడికొండ : సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఒకేషనల్ కళాశాలలో తాత్కాలిక బోధన కోసం అర్హత, అనుభవం కలిగిన నిపుణులకు ఇంటర్వ్యూలు, డెమోలు నిర్వహించి ఎంపిక చేయనున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ దాసరి ఉమామహేశ్వరి తెలిపారు. రాష్ట్రంలోని హత్నూరు, శంకరపల్లి, వర్ధన్నపేట(మడికొండ), కొండాపూర్, న్యాల్కల్, హుస్నాబాద్, శంషాబాద్ బాలుర కళాశాలలతో పాటు మడికొండ, బంట్వారం, జగద్గిరిగుట్ట, వికారాబాద్(డిగ్రీ), చింతకుంట, ఆలేరు, బద్దెనపల్లి, మహబూబాబాద్ బాలికల కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్, అనిమేషన్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ టెక్నీషియన్, టూరిజం హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఆఫీస్ అసిస్టెంట్షిప్, అకౌంటింగ్ టాక్సేషన్, కమర్షియల్ గవర్నమెంట్ టెక్నాలజీ, ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్, ఫార్మా టెక్నాలజీ సబ్జెక్టులలో బోధించడానికి నిపుణులైన బోధకులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో ఈనెల 8న ఉదయం 9 గంటల నుండి నిర్వహించనున్న ఇంటర్వ్యూ, డెమోలకు హాజరుకావాలని ఆమె తెలిపారు. ఇంటర్వ్యూ వచ్చే అభ్యర్థులు తమ అర్హత పత్రాలతో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు http:tgswreis.telangana.gov.in వెబ్ సైట్ లో సంప్రదించాలని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.