హనుమకొండ, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వర్గపోరు, అసమ్మతి గొడవలకు కాంగ్రెస్ మారుపేరుగా నిలుస్తున్నది. పరిపాలన, సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆధిపత్యం కోసం ఇష్టం వచ్చినట్లుగా తిట్టుకుంటున్న పరిస్థితి నెలకొన్నది. మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఇన్నాళ్లు అంతర్గతంగా ఉ న్న వర్గపోరు ఇప్పుడు ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకునే వరకు వెళ్లాయి. నాలుగు రోజుల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి పరకాల పర్యటనతో ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీలోని ముఖ్యనేతల మధ్య పంచాయితీ పరాకాష్టకు చేరింది. ముఖ్యమంత్రి పాల్గొన్న సభ కు ఉమ్మడి జిల్లా మంత్రిగా హాజరుకావాల్సిన కొండా సురేఖ దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారిం ది. 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొన్ని రోజుల నుంచే మంత్రి కొండా సురేఖకు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఒక వర్గం నేతలపై మరో వర్గం దాడులు చేసుకోవడం, కేసుల నమోదు వరకు వెళ్లింది.
మంత్రి, ఎమ్మెల్యే పరస్పరం విమర్శలు చేసుకునే పరిస్థితి వచ్చింది. రేవూరి ప్రకాశ్‌రెడ్డిని మరోసారి గెలిపించాలని పరకాల సభలో సీఎం రేవంత్‌రెడ్డి అనడంతో వర్గపోరు మరింత ముదిరింది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి వ్యతిరేకంగా సురేఖ కుమార్తె సుస్మిత విమర్శలు చేశారు. అక్కడితో ఆగకుండా సీఎం రేవంత్‌రెడ్డిపైనా, ఆయన సోదరులపైనా.. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డిపై నా తీవ్రమైన ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని.. అవసరమైతే ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. సుస్మిత వ్యాఖ్యలపై రేవూరి ప్రకాశ్‌రెడ్డి స్పందించారు. ప్రకాశ్‌రెడ్డికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మద్దతుగా నిలిచి సుస్మితపై విమర్శలు చేశారు. చివరికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకొని సుస్మిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని మంత్రి సురేఖకు నోటీసులు జారీ చేసింది.
పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు అంతు లేకుండా సాగుతున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి లక్ష్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసమ్మతి రాజకీయం ఆసక్తికరంగా మారుతున్నది. యశస్వినీరెడ్డి, ఆమె అత్త, పీసీసీ ఉపాధ్యక్షురాలు హనమాండ్ల ఝాన్సీరెడ్డి అసమ్మతి వాదులు పొంగులేటికి అండగా ఉంటున్నారు. ఆరు నెలలుగా నడుస్తున్న వర్గపోరు రోజురోజుకు ముదురుతున్నది. ఈ పరిస్థితులను అసరగా చేసుకుని వచ్చే ఎన్నికల్లో తన అల్లుడిని పాలకుర్తి సెగ్మెంట్ నుంచి పోటీ చేయించేందుకు పొంగులేటి అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలకు తెరలేపారు. దీంతో పాలకుర్తి రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. యశస్విని, ఝాన్సీరెడ్డిపై పాలకుర్తి నియోజకవర్గంలోని అసమ్మతి నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి పదేపదే ఫిర్యాదు చేశారు. భారత పౌరసత్వం లేకుండానే ఝాన్సీరెడ్డికి పీసీసీ ఉపాధ్యక్ష పదవి ఇచ్చారని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నారని.. ఆమెను పదవి నుంచి తొలగించాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ఫిర్యాదు చేశారు.
ఝాన్సీరెడ్డి వ్యవహారశైలిపై తొర్రూరు మండలంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమాండ్ల తిరుపతిరెడ్డి, కాకిరాల హరిప్రసాద్, రామసాయం కిశోర్‌రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు మూడుసార్లు, ఇతర నేతలు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌కు గతంలో, తాజాగా ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ కోసం కష్టపడిన కార్యకర్తలను పకనపెట్టి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి నామినేటెడ్ పోస్టుల్లో, పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తున్నారని, తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమికి ఝాన్సీరెడ్డి ఏకపక్ష వైఖరే కారణమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఝాన్సీరెడ్డి తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో దళితులకు ఒక సీటు కేటాయించకపోవడం వల్ల కాంగ్రెస్ ఓటమిపాలైందని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం వల్ల మేజర్ జీపీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారన్నారు. సీనియర్ నాయకులను పార్టీకి దూరం చేసేలా వ్యవహరిస్తున్న ఝాన్సీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఝాన్సీరెడ్డిపై పీసీసీ నాయకత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. నియోజకవర్గంలోని పార్టీ నేతలతో సమన్వయం చేసుకోవాలని, సీనియర్ నాయకులకు తగిన గౌరవం ఇవ్వాలని స్పష్టం చేసినట్లు సమాచారం. అసమ్మతి నేతలు పీసీసీకి ఫిర్యాదు చేయడం, ఝాన్సీరెడ్డి వాటిపై వివరణ ఇవ్వడంతో రెండు వర్గాల మధ్య వివాదం పెరుగుతూనే ఉన్నది.
మంత్రి కొండా సురేఖకు ఉమ్మడి జిల్లాలోని మెజారిటీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వ్యతిరేకంగా ఉంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఉమ్మడి జిల్లాలోని మరో మంత్రి సీతక్కకు, సురేఖకు మధ్య విభేదాలు మొదలయ్యాయి. మేడారం అభివృద్ధి పనులు, వరంగల్‌లోని ధార్మిక భవనంలో ఆఫీసుల కేటాయింపు, మేడారం పూజారుల అంశాల్లో ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్యపోరు తీవ్రమైంది. మేడారం జాతర నిర్వహణకు దేవాదాయ మంత్రి సురేఖ దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇద్దరు మంత్రులు కలిసి కార్యక్రమాల్లోనూ పాల్గొనడంలేదు. ఉమ్మడి వరంగల్ ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోనూ సురేఖకు తీవ్రమైన విభేదాలున్నాయి. సురేఖ, ఆమె భర్త మురళీధర్‌రావు పలుసార్లు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని బహిరంగంగానే విమర్శించారు. సీఎం సలహాదారుడు వేం నరేందర్రెడ్డిపైనా ఆరోపణలు చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డితోనూ సురేఖకు మొదటి నుంచి విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, సురేఖ పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. కొండా సురేఖకు తాజాగా పీసీసీ నోటీసులతో ఆమెకు వ్యతిరేకంగా ఉన్న ఇతర ప్రజాప్రతినిధులు మరోసారి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.