నమస్తే తెలంగాణ నెట్వర్క్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాలికలు సత్తా చాటారు. బాలురతో పోల్చితే బాలికలే అత్యధిక ఉత్తీర్ణత సాధించి పైచేయి సాధించారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో ములుగు జిల్లా ద్వితీయ సంవత్సరంలో 82.12 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో 4వ స్థానంలో, మొదటి సంవత్సరంలో 71.31శాతం ఉత్తీర్ణత సాధించి 5వ స్థానంలో నిలిచింది. జనగామ జిల్లాలో జనరల్, ఒకేషనల్ కలిపి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 8,054 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 5,208 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఇందులో ఫస్టియర్లో 57.82శాతం, సెకండియర్లో 70.92శాతం ఉత్తీర్ణత సాధించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రథమ సంవత్సరంలో 1454 మంది పరీక్ష రాయగా 1062(73.04 శాతం) మంది, ద్వితీయ సంవత్సరంలో 1478 మంది పరీక్ష రాయగా 1184 (82.12 శాతం )మంది పాస్ అయ్యారు. హనుమకొండ జిల్లా ప్రథమ సంవత్సరంలో 17,465 విద్యార్థులకు 12,078(69.16శాతం)ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో 7వ స్థానంలో, సెకండియర్లో 17,435 విద్యార్థులకుగాను 13,698(78.57శాతం) ఉత్తీర్ణత సాధించి 8వ స్థానంలో నిలిచింది. వరంగల్ జిల్లాలో ఫస్టియర్ విద్యార్థులు 53 శాతం, సెకండియర్ 61 శాతం, మహబూబాబాద్ జిల్లాలో సెకండియర్ 65.2శాతం, ఫస్టియర్ 48.1 శాతం ఉత్తీర్ణత సాధించారు.