హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 20: కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ లో నిర్వహిస్తున్న 2024-25 విద్యా సంవత్సరం అంతర్ కళాశాలల పురుషుల క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. బాల్‌బ్యాడ్మింటన్‌లో మొదటి బహుమతి వాగ్దేవి కాలేజీ, రెండవ బహుమతి సీకేఎం, ఖోఖోలో మొదటి బహుమతిని కేయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ, రన్నర్స్‌గా కేడీసీ, సాఫ్ట్‌బాల్‌లో మొదటి బహుమతిని ఆర్ట్స్ కాలేజీ, రన్నర్స్ గా వాగ్దేవి ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ నిలిచింది. విజేతలకు ఎమ్మె ల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ట్రో ఫీలను అందజేసి క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో మంచి క్రీడాకారులను తయారు చేసేందుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. అందు కు కావాల్సిన ప్రణాళికలు తయారుచేసి తమకు పంపిస్తే కేయూ చాన్స్‌లర్‌తో మాట్లాడి క్రీడల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా చర్యలు చేపడతానన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి మాట్లాడుతూ కాలేజీలో విద్యతోపాటు క్రీడలను కూడా ప్రోత్సహించేందుకు అంతర్ కళాశాలల క్రీడలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేయూ స్పోర్ట్స్ బోర్డు సంచాలకులు ప్రొఫెసర్ వెంకయ్య, వైస్ ప్రిన్సిపాల్ పుల్లా రమేశ్, ఫిజికల్ డైరెక్టర్ భాసర్, గిరిప్రసాద్, హెల్త్ సెంటర్ నిర్వాహకులు సలీం, ప్రవీణ్, రాజు పాల్గొన్నారు.