గిర్మాజీపేట, ఫిబ్రవరి 10: జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు కేంద్రాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి 17 రోజుల్లో శుక్రవారం వరకు 1,07,723 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్‌వో కాజీపేట వెంకటరమణ తెలిపారు. ఇందులో 21,661 మందికి రీడింగ్ గ్లాసులు అందించినట్లు వెల్లడించారు. 12,786 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసుల కోసం ఆర్డర్ ఇవ్వగా, శుక్రవారం నాటికి 766 మందికి అందించినట్లు చెప్పారు. కంటి వెలుగు కేంద్రాలు రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏదైనా కేంద్రంలో సమస్యలుంటే జిల్లా కంటి వెలుగు ఎమర్జెన్సీ మానిటరింగ్ సెల్ సెంటర్ నుంచి పరిష్కరిస్తున్నట్లు చెప్పారు.
గ్రేటర్ వరంగల్‌లోని కలెక్టరేట్, ఐఎంఏ హాల్, ఎనుమాముల మార్కెట్లో కూడా నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. గురువారం వరకు జిల్లాలో 37 గ్రామ పంచాయతీలు, 9 వార్డుల్లో నేత్ర పరీక్షలు పూర్తయ్యాయని వెల్లడించారు. 25 గ్రామ పంచాయతీలు, 19 వార్డుల్లో త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 1,07,723 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, అందులో 49,908 మంది పురుషులు, 57,806 మంది మహిళలు, 8 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు వివరించారు. జిల్లాలోని 17,361 ఎస్సీలు, 8,610 ఎస్టీలు, 73,668 బీసీలు, 4,979 ఓసీలు, 3,104 మైనార్టీలకు కంటి పరీక్షలు చేసినట్లు డీఎంహెచ్‌వో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో 73,276 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని ఆయన తేల్చి చెప్పారు.
‘కంటి వెలుగు’ను వినియోగించుకోవాలి
సంగెం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్ కాజీపేట వెంకటరమణ సూచించారు. రాంచంద్రాపురంలో కంటి వెలుగు శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా శిబిరానికి వచ్చిన ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందికి సంబంధించిన రిజిస్టర్లను ఆయన పరిశీలించి సూచనలు చేశారు. ప్రజలందరూ శిబిరానికి వచ్చి పరీక్షలు చేయించుకునేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు. అనంతరం డాక్టర్ అశోక్‌ను అభినందించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పొగాకుల అశోక్, అరవింద్‌రాజ్, వైద్య సిబ్బంది ప్రసాద్, సత్యరాజ్, రేణుక, రంజిత్, గజ్జెల కుమారస్వామి, వెంకటరమణ, ప్రసూన, సునీత, సుజాత, హనుప్రియ, మౌనిక, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
శిబిరాలు కళకళ..
నర్సంపేటరూరల్/పర్వతగిరి: కంటి వెలుగు శిబిరాలు ప్రజలతో కళకళలాడుతున్నాయి. నర్సంపేట మండలంలోని ఆకులతండా, భోజ్యానాయక్‌తండా, ఏనుగల్తండాలో నేత్ర పరీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ప్రజలకు నేత్ర పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు బానాల అరుణ్‌చంద్ర, కల్యాణి, సర్పంచ్‌లు బానోత్ రాము, భూక్యా లలిత, బానోత్ స్వాతి, హెచ్‌ఈవో సంజీవరావు, హెల్త్ అసిస్టెంట్ సంజయ్‌కుమార్, లక్ష్మణ్, మాధవరావు, అనిత, స్రవంతి, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. పర్వతగిరి మండలంలోని భట్టుతండా-2 గ్రామ పంచాయతీలో కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ అమ్మీనాయక్ ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ అసావత్ సరోజ, కార్యదర్శి చైతన్య, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
కంటి వెలుగుకు అనూహ్య స్పందన
నల్లబెల్లి: కంటి వెలుగు కార్యక్రమానికి మండలంలో అనూహ్య స్పందన వస్తున్నది. మేడెపల్లి, నల్లబెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఐదు వేల మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేడెపల్లి వైద్యాధికారి శశికుమార్ మాట్లాడుతూ మేడెపల్లి పీహెచ్‌ఎసీ పరిధిలో ఇప్పటి వరకు 800 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులు పంపిణీ చేశామన్నారు. మరో 500 మందికి ఆర్డర్ చేశామన్నారు. షెడ్యూల్ ప్రకారం గ్రామాల్లో ముందస్తుగా టాంటాం వేసి కంటి వెలుగు కార్యక్రమంపై ప్రచారం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను కోరారు. దృష్టి సమస్యలు ఉన్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.