పాలకుర్తి, జూన్ 1: రెండు రోజులుగా పాలకుర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ తల్లి విగ్రహ గద్దె నిర్మాణ వివాదం రాజుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఆధిపత్య పోరు సాగింది. కాంగ్రెస్ నాయకులు పోలీసుల అండతో గూండాయిజం చేస్తూ రాత్రికి రాత్రే గద్దె నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రతిగా బీఆర్ఎస్ శ్రేణులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సతీమణి ఉషా దయాకర్‌రావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ర్యాలీగా పోలీస్‌స్టేషన్‌కు వస్తుండగా వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య ఆధ్వర్యంలో రాజీవ్ చౌరస్తాలో అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
తోపులాట జరిగింది. పార్టీ శ్రేణులు ప్రతిఘటించారు. ఈ క్రమంలో ఉషా దయాకర్‌రావు కొంత ఆస్వస్థతకు గురైంది. అయినా పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆవేశంతో రగిలిపోయారు. పోలీసు జులుం నశించాలి..పోలీసులు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ గుండాయిజం నశించాలి అంటూ నినాదాలు చేశారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల్లా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ఉషా దయాకర్‌రావు నిలదీయడంతో చివరకు పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులను విడిచి పెట్టడంతో స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ ఎదుట నినాదాలు చేశారు. పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఉషా దయాకర్‌రావు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు హనుమండ్ల ఝాన్సీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఝాన్సీరెడ్డిపై కేసు నమోదు చేయాలి : ఎర్రబెల్లి ఉషా దయాకర్‌రావు
కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి హనుమండ్ల ఝాన్సీరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయాలని ఎర్రబెల్లి ఉషా దయాకర్‌రావు అన్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఝాన్సీరెడ్డిపై ఫిర్యాదు చేసిన ఆనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విదేశీయురాలైన ఝాన్సీరెడ్డికి భారత పౌరసత్వం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఓటు హక్కులేని ఝాన్సీరెడ్డి రాజకీయాలు చేయడమేమిటని ప్రశ్నించారు. ఓటు హక్కులేని ఝాన్సీరెడ్డికి కుర్చీలు వేసి మర్యాదలు చేసిన పోలీసులు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు భార్యనైన తనకు మర్యాద ఇవ్వకపోవడం బాధకరమన్నారు. పోలీసులు మహిళను అని చూడకుండా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా అని పోలీసులపై మండిపడ్డారు.
శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఝాన్సీరెడ్డినా, ఆమె కోడలు యశస్వినీరెడ్డినా ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఝాన్సీరెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి బీఆర్ఎస్ శ్రేణులపై ఆక్రమ కేసులు పెట్టించడం ఎంత వరకు సమంజసమన్నారు. పోలీసులు కాంగ్రెస్ తొత్తులుగా పనిచేస్తున్నారని విమర్శించారు. పాలకుర్తిలో ప్రజాస్వామం ఉందా అని ప్రశ్నించారు. పోలీసుల రక్షణ వలయంలో కాంగ్రెస్ గూండాలు గద్దె నిర్మించి విగ్రహన్ని ప్రతిష్ఠించడం 15ఏళ్లుగా పాలకుర్తి నియోజక వర్గానికి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాడని చెప్పారు.
ఏనాడూ ఘర్షణ రాజకీయాలు చేయలేదన్నారు. ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి అభివృద్ధిలో పోటీ పడాలని సవాల్ విసిరారు. 17నెలల కాంగ్రెస్ పాలనలో పాలకుర్తి నియోజక వర్గంలో అభివృద్ధి శూన్యమన్నారు. అధికారం చేతిలో ఉందని బీఆర్ఎస్ శ్రేణులను బెదిరింపులకు గురి చేస్తూ ఝాన్సీరెడ్డి, ఆమె కోడలు యశస్వినీరెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ఝాన్సీరెడ్డి పోలీస్ అధికారులను దుర్భాలాషలాడుతూ ఎస్ఐని తిట్టడం అన్యాయమన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జోగు గోపీపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం అమానుషమన్నారు.
గోపీని పరామర్శించిన ఉషా దయాకర్‌రావు
కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న గోపీని ఉషా దయాకర్‌రావు పరామర్శించారు. వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని తాము త్వరలోనే అధికారంలోకి వస్తామన్నారు. వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. పోలీసు అధికారుల్లారా ఖబర్దార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఆధైర్య పడొద్దని, అండగా ఉంటామన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్దే అధికారమని జోస్యం చెప్పారు. పాలకుర్తి నియోజక వర్గంలో బీఆర్ఎస్ శ్రేణులను ముందస్తు అరెస్టులు చేయడం అక్రమమన్నారు.