కాంగ్రెస్ సర్కారు కొత్తగా ఒక్క అభివృద్ధి పనినీ ప్రారంభించలేదు.. కనీసం గత ప్రభుత్వ హయాంలోనే మొదలుపెట్టిన పనులను కొనసాగిస్తుందా? అంటే అదీ లేదు.. దీంతో నిధుల లేమితో పలు పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఇందుకు తార్కాణంగా హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిలుస్తాయి. నగర ప్రజలకు ఒకే చోట వెజ్, నాన్ వెజ్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ మార్కెట్లు ఉండేలా గత బీఆర్ఎస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ఈ మార్కెట్లకు శ్రీకారం చుట్టింది. మొదటి విడతగా విడుదల చేసిన నిధులతో పనులు పిల్లర్లు, స్లాబ్ లెవల్‌కు చేరాయి. ఈ సమయంలో ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారింది. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ సర్కారు వీటి నిర్మాణానికి ఒక్క పైసా విదల్చలేదు. ఫలితంగా ఆరు నెలలుగా పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
– వరంగల్, జనవరి 5
గ్రేటర్ వరంగల్‌లో మొదలు పెట్టిన ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణ పనులు నిధులు లేక మధ్యలోనే నిలిచిపోయాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వరంగల్ లక్ష్మీపురంలో వెజ్, నాన్ వెజ్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, హనుమకొండ ఐబీ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణానానికి శ్రీకారం చుట్టింది. రూ. 24 కోట్ల అంచనాతో లక్ష్మీపురం, రూ. 9 కోట్లతో ఐబీ గెస్ట్‌హౌస్ మార్కెట్లకు ప్రణాళికలు సిద్ధం చేయగా, తొలి విడతలో ఒక్కో మార్కెట్‌కు రూ. 4.50 కోట్ల చొప్పున నిధులు కేటాయించడంతో పనులు మొదలయ్యాయి. అయితే కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది గడిచినా నయా పైసా విడుదల చేయకపోవడంతో మార్కెట్ల పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఈ పనులకు నిధులెట్లా సర్దుబాటు చేయాలో తెలియక కార్పొరేషన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి లేఖలు రాసి చేతులు దులుపుకున్నారు.
రూ. 24 కోట్ల అంచనాతో వరంగల్ లక్ష్మీపురంలో వెజ్, నాన్ వెజ్, ప్రూట్స్, ఫ్లవర్స్ మార్కెట్లు ఒకే ప్రాంగణం (ఇంటిగ్రేటెడ్)లో ఉండేలా డిజైన్ చేశారు. ముందస్తుగా రూ. 4.50 కోట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రతినెలా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌కు విడుదల చేసే పట్టణ ప్రగతి నిధుల నుంచి మిగతా నిధులు సర్దుబాటు చేసుకొని పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. మొదటి విడత నిధులతో కొన్ని బ్లాకుల్లో స్లాబ్‌లు పూర్తిచేయగా, మరికొన్ని పిల్లర్ల స్థాయిలో ఉన్నాయి.
అలాగే హనుమకొండలోని ఐబీ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం సైతం సగంలోనే ఆగిపోయింది. ఈ మార్కెట్‌కు కూడా గత ప్రభుత్వం రూ. 4.50 కోట్లు విడుదల చేయగా, వాటితోనే సగం పనులు పూర్తయ్యాయి. ఆయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పట్టణ ప్రగతి నిధులు నిలిపివేయడంతో మార్కెట్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. వీటిని పూర్తి చేయాలంటే ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఈ విషయమై బల్దియా అధికారులను అడిగితే ప్రభుత్వానికి లేఖ రాశామని, నిధులు వస్తే పనులు చేపడుతామని అంటున్నారు.
గ్రేటర్లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు నయా పైసా విడుదల చేయలేదు. గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతోనే సగం పనులు పూర్తిచేశారు. గత ఆరు నెలలుగా నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. రెండు మార్కెట్లకు కలిపి రూ. 24 కోట్లు మంజూరు చేస్తే పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు.